కరోనా కట్టడి చేసిన యువ సర్పంచ్‌లు 

V6 Velugu Posted on Jun 07, 2021

సెకండ్‌ వేవ్‌లో కరోనాను అదుపు చేయడం చాలా కష్టంగా మారింది. కానీ అక్కడక్కడా కొన్ని ఊళ్లు మాత్రం సరైన చర్యలతో కరోనాను కంట్రోల్​ చెయ్యడంలో సక్సెస్‌ అయ్యాయి. ఈ విజయం వెనుక కొంతమంది యువ సర్పంచ్‌లు ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు యువ సర్పంచ్‌లు తమ ఊళ్లలో కరోనాను అదుపు చేసి,  ప్రధాని మోడీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకున్నారు. మహారాష్ట్రకు చెందిన రుతురాజ్‌ దేశ్‌ముఖ్‌, కోమల్‌ కార్పెల వయసు 21. చిన్న వయసులోనే సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. రాజకీయాలు, పరిపాలన గురించి అనుభవం లేకపోయినా.. తమ ఊళ్లలో సెకండ్‌ వేవ్‌ స్టార్ట్‌ కాగానే, కరోనా కట్టడికి అందరికంటే ముందుగా అలర్ట్​ అయ్యారు. 
బీ పాజిటివ్‌
సెకండ్‌వేవ్‌ ఎక్కువగా విజృంభించిన మహారాష్ట్రలో కొన్ని గ్రామాలు ముందుగానే జాగ్రత్తపడ్డాయి. వాటిలో ఘటానే అనే గ్రామం ఒకటి. ఈ గ్రామ సర్పంచ్‌ రుతురాజ్‌ దేశ్‌ముఖ్‌. ఎల్‌ఎల్‌బీ చదువుతూనే, సర్పంచ్‌గా చేస్తున్నాడు. వీళ్ల ఊళ్లో ఏప్రిల్‌లో మొదటి కేసు నమోదవ్వగానే, జనాలంతా ఊరవతలకు వెళ్లి పొలాల్లోనే ఉండటం మొదలుపెట్టారు. దీంతో కరోనాను అదుపుచేయాలని రుతురాజ్‌ నిర్ణయించుకున్నాడు. ‘బీ పాజిటివ్‌.. కరోనా నెగెటివ్‌’ పేరుతో ప్రచారం స్టార్ట్‌ చేశాడు. దీనిలో భాగంగా ఊళ్లో వాళ్లందరికీ కరోనా గైడ్‌లైన్స్‌ గురించి వివరించి, లక్షణాలు ఉన్న వాళ్లందరికీ టెస్టులు చేయించాడు. అలా కరోనా వచ్చిన వాళ్లను గుర్తించి, ఇతరులకు సోకకుండా చూసుకో గలిగాడు. సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ పెట్టుకుని, ఊళ్లోకి ఎవరినీ రానివ్వకుండా చూసుకున్నాడు. రూల్స్‌ పాటించని వాళ్లకు ఫైన్​ వేశాడు. గ్రామస్తుల సహకారంతో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకున్నాడు. దీంతో గత నెల రోజుల నుంచి ఆ ఊళ్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం ఈ ఊరు ‘కొవిడ్‌ ఫ్రీ విలేజ్​’గా నిలిచింది.
రెండు వారాలుగా...
ఆంత్రోలి అనే మరో గ్రామంలో కూడా రెండు వారాల నుంచి కరోనా కేసులు నమోదు కాలేదు. దీనికి కారణం, ఆ ఊరి సర్పంచ్‌ కోమల్‌ కార్పె. సెకండ్‌వేవ్‌లో ఈ ఊళ్లో చాలామందికి కరోనా వచ్చినా, జనాలు టెస్ట్‌ చేసుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో కోమల్ స్థానిక పంచాయతి అధికారులు, పోలీసులు, అంగన్‌వాడీ కార్యకర్తలతో కలిసి ఒక గ్రూప్‌ ఏర్పాటు చేసింది. కొవిడ్‌పై అవగాహన కల్పించి, బాధితుల్ని గుర్తించి ట్రీట్​మెంట్​లో సాయపడింది. గ్రామంలో పూర్తి లాక్‌డౌన్‌ పెట్టారు. బయటినుంచి వచ్చే వాళ్లు క్వారంటైన్‌ పాటించేలా చేశారు. ఇలాంటి అన్ని చర్యల వల్ల ఇప్పుడు ఊళ్లో పూర్తిగా కరోనా అదుపులోకి వచ్చింది. రెండు వారాలకుపైగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ప్రస్తుతం ఆంత్రోలి కూడా ‘కరోనా ఫ్రీ విలేజ్’ అయింది.

Tagged Maharashtra, sarpanch, WORK, young, Corona control,

Latest Videos

Subscribe Now

More News