
- సూర్యాపేటలో అంతిమ ర్యాలీ
- ప్రజల సందర్శనార్థం పార్టీ ఆఫీసులో పార్థివదేహం
సూర్యాపేట, వెలుగు: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. శనివారం ఉదయం 12 గంటలకు తుంగతుర్తిలోని వ్యవసాయ క్షేత్రంలో అధికారికంగా దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. గత బుధవారం హైదారాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ దామోదర్‌రెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే. సందర్శనార్థం శుక్రవారం ఆయన భౌతిక కాయాన్ని సూర్యాపేటలోని పార్టీ కార్యాలయంలో ఉంచారు.
భౌతికకాయానికి కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు నివాళులర్పించారు. తమ అభిమాన నాయకుడి కడసారి చూపుకోసం పార్టీలకతీతంగా భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వారంతా ఆయనతో ఉన్న అనుబంధాన్ని, ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కరుడుగట్టిన కమ్యూనిస్టుల ప్రాభవం ఉన్న తుంగతుర్తిలాంటి ప్రాంతంలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించి, సుమారు 40 ఏండ్లుగా ఆ ప్రాంతంలో పార్టీని బలంగా నిలబెట్టిన ఘనత దామోదర్‌రెడ్డికే దక్కుతుందని నాయకులు కొనియాడారు.
సూర్యాపేటలో భారీ ర్యాలీ
సూర్యాపేటలో దామోదర్ రెడ్డి అంతిమ ర్యాలీ నిర్వహించారు. పార్థివ దేహాన్ని భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయం అయిన రెడ్ హౌస్ కు తరలించారు. ఎస్వీ కాలేజ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ తాళ్లగడ్డ, కోర్టు చౌరస్తా మీదుగా రెడ్ హౌస్ వరకు సాగింది.. ర్యాలీ సందర్భంగా అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అంతిమ యాత్రలో పాల్గొన్న వేలాది మంది ప్రజలు ‘టైగర్ దామన్నా అమర్ రహే’, ‘లాంగ్ లివ్ దామన్నా’ అంటూ నినాదాలు చేశారు.