తండ్రి మృతి.. తల్లి మిస్సింగ్

తండ్రి మృతి.. తల్లి  మిస్సింగ్
  • గాంధీలో దైన్యస్థితిలో మూడేండ్ల చిన్నారి
  • రెండు రోజుల తర్వాత మేనమామల చెంతకు

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో రెండు రోజులుగా దిక్కుతోచని స్థితిలో ఉన్న మూడేండ్ల చిన్నారి ఎట్టకేలకు తన మేనమామల చెంతకు చేరింది. నారాయణపేట జిల్లా కోస్గి గ్రామానికి చెందిన బాబు (35), శాంతమ్మ (31) దంపతులకు మూడేళ్ల కుమార్తె కార్తీక ఉంది. ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో బాబు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. భర్త మరణంతో మానసిక ఒత్తిడికి గురైన శాంతమ్మ చిన్నారి కార్తీకను ఆసుపత్రిలోనే వదిలేసి ఎటో వెళ్లిపోయింది. 

దీంతో గాంధీ క్యాంటిన్ వద్ద ఏడుస్తున్న చిన్నారిని సెక్యూరిటీ సిబ్బంది చేరదీసి, చిలకలగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. శనివారం పత్రికల్లో వార్త చూసిన వికారాబాద్ జిల్లా దుడ్యాల్ మండలం చిల్మల్ మైలారం గ్రామానికి చెందిన కార్తీక మేనమామలు శేఖర్, నర్సయ్య సికింద్రాబాద్​కు వచ్చారు. 

చిలకలగూడ పీఎస్​లో ఇన్‌స్పెక్టర్ అనుదీప్, ఎస్‌ఐ రాకేశ్ ను కలిసి వివరాలు తెలిపారు. అనంతరం గాంధీ సెక్యూరిటీ చీఫ్ శివాజీ చిన్నారిని పోలీసుల సమక్షంలో మేనమామలకు అప్పగించారు. పోలీసులు వారి స్వగ్రామ సర్పంచ్​తో సమాచారం నిర్ధారించి, కార్తీకను కుటుంబ సభ్యులకు అప్పగించారు. రెండు రోజులు చిన్నారిని సంరక్షించిన గాంధీ సెక్యూరిటీ సిబ్బందిని పోలీసులు అభినందించారు.