
- టైగర్లకు సేఫ్ ప్లేస్ నుంచి డేంజర్ జోన్ గా మారిన కాగజ్‌నగర్ డెన్
- పొట్టనపెట్టుకుంటున్న వేటగాళ్లు
- 16 నెలల్లో మూడు పులులు మృతి
- పాఠాలు నేర్వని ఫారెస్ట్ ఆఫీసర్లు
- సమస్య వచ్చినప్పుడే హడావుడి తప్ప నిరంతర రక్షణ కరువు
ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు: పులులకు అవాసానికి, నివాసానికి కేరాఫ్‌గా ఉండే ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ డివిజన్ అడవులు వాటిని డేంజర్‌జోన్‌గా మారాయి. కొన్నేండ్ల క్రితం డజను వరకు టైగర్లు తిరుగుతూ తమ డెన్‌గా మార్చుకున్న కాగజ్‌నగర్ అడవులు ఇప్పుడు వాటికి ప్రాణసంకటంగా మారాయి. వేటగాళ్ల చేతిలో బలవుతున్నాయి. కాగజ్‌నగర్ అటవీ ప్రాంతం మహారాష్ట్రలోని తడోబా అంధేరి టైగర్ రిజర్వ్‌కు ఆనుకుని ఉంది. తడోబా రిజర్వ్‌లో ఎక్కువగా ఉండే పులులు ఆవాసం వెతుక్కుంటూ కాగజ్‌నగర్‌లోని అడవుల్లోకి వస్తుంటాయి. అయితే ఇది వాటిని శాపంగా మారుతోంది. వేటగాళ్ల ఉచ్చులతోపాటు పలు కారణాలతో పులులు ప్రాణాలు కోల్పోతున్నాయి.
ప్రాణాలు కోల్పోతున్న ఒక్కో పులి
అయిదేండ్ల క్రితం పదికి పైగా ఉన్న పులుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గతేడాది జనవరి 8న కాగజ్ నగర్ రేంజ్‌లోని దరిగాం అటవీ ప్రాంతంలో టెరిటోరియల్ ఫైట్‌లో ఓ పులి చనిపోగా.. ఆ రెండ్రోజుల తర్వాత విషాహారం తిని మరో పులి మృతి చెందింది. దీంతో జిల్లాలోని ఫారెస్ట్ సిబ్బంది మిగిలిన పులుల కోసం కాగజ్‌నగర్ రేంజ్, సిర్పూర్ టీ రేంజ్‌ల్లో జల్లెడ పట్టారు. దీంతో డిస్ట్రబ్ అయిన పులులు వేరే ప్రాంతాలకు వెళ్లి కొన్ని నెలల పాటు ఇక్కడ కనిపించలేదు. ఆ తర్వాత ఆరు నెలలకు పులి అలజడి కనిపించింది. అడపాదడపా సంచారం తప్ప ఇక్కడ ఆవాసం ఏర్పరుచుకోవడంలేదు. ఎనిమిదేండ్ల క్రితం కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలోనే జన్మించిన కే–8 పులి తాజాగా వేటగాళ్ల కరెంటు తీగలకు బలైంది. పులుల డెన్ గా, సంతానోత్పతి జరుపుకునే అడవులకు కేరాఫ్‌గా మారిన కాగజ్ నగర్ అడవుల్లో ఒక్కో పులి ఊహించని రీతిలో, వేటగాళ్ల పన్నాగా నికి ప్రాణాలు కోల్పోతున్నాయి.
అటకెక్కిన కన్జర్వ్ రిజర్వ్
పులులు, వైల్డ్ లైఫ్‌ను కాపాడేందుకు కాగజ్ నగర్ అడవులను కన్జర్వ్ రిజర్వ్ ఫారెస్ట్‌గా ఏర్పాటు చేసే అంశం తెరపైకి వచ్చింది. పులుల, వన్యప్రాణుల ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో నిర్బంధంగా అడవులను కాపాడుతూ అటవీ ప్రాంతాన్ని మరింత పెంచడం, తద్వారా ఎకో టూరిజం, స్థానికులకు లైవ్లీ హుడ్ పెంచాలని ప్రభుత్వం భావించింది. కానీ అధికారుల నిర్లక్ష్య కారణంగా కార్యరూపం దాల్చలేదు.
హడావిడి చేసి ఆపై మరిచి..
గతేడాది డిసెంబర్ 29న కాగజ్ నగర్ రేంజ్‌లోని ఈస్గాం బెంగాలీ క్యాంప్ సమీపంలో పత్తి చేనులో మోర్లే లక్మీ అనే మహిళ మీద పులి దాడి చేసి చంపింది. మరుసటి రోజు సిర్పూర్ టీ మండల దుబ్బగూడ శివారులో సురేశ్ అనే రైతు మీద దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటనలతో ఫారెస్ట్ ఆఫీసర్లు కొంత హడావుడి చేశారు. మహారాష్ట్రలోని తడోబా–అంధేరి టైగర్ రిజర్వ్ అధికారులు, సిబ్బందితో అంతరాష్ట్ర మీటింగ్ నిర్వహించి పులుల సంతతి, దాన్ని కాపాడేందుకు చేపట్టే చర్యలు, ఫీల్డ్ మానిటరింగ్, ప్రజల సహకారంపై అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కానీ ఫీల్డ్‌లో మాత్రం వాటిని అమలు చేసిన దాఖలాలు లేవు. కరెంట్ తీగలకు తగిలి టైగర్ చనిపోగా ఉన్నతాధికారులు 15వ తేదీ సాయంత్రం వరకు దాని కదలికలను గుర్తించలేదు. పులి కళేబరాన్ని తునికాకు కూలీలు చూసి సమాచారం ఇస్తే గానీ అధికారులకు విషయం తెలియరాలేదు. ఆ తర్వాత వారు పులి కళేబరాన్ని గుర్తించేలోపు వేటగాళ్లు వచ్చి దారి గోర్లు, దంతాలు, చర్మం వలుచుకొని వెళ్లడం గమనార్హం.
అధికారులు ఇప్పటికైనా మేల్కోవాలె
అధికారులు, సిబ్బంది కొరతతోపాటు పులుల సంరక్షణ విషయంలో పూర్తి అవగాహన లేకపోవడం.. వేటగాళ్లు, వారికి సహకరించే వారిని గుర్తించి కట్టడి చేయకపోవడం పులులకు ప్రాణసంకటంగా మారింది. పులులు ఒక్కోటి చనిపోతుండడంతో వాటి సంరక్షణ, సంతానోత్పత్తి విషయంలో అధికారులు ఫెయిల్ అయ్యారని జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వహించకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు.