మహబూబ్నగర్ జిల్లాలో లెక్క తేలింది.. పోరు మిగిలింది..రెండో విడత విత్డ్రాలు కంప్లీట్

మహబూబ్నగర్ జిల్లాలో  లెక్క తేలింది.. పోరు మిగిలింది..రెండో విడత విత్డ్రాలు కంప్లీట్
  • ఇంటింటి ప్రచారాన్ని మొదలుపెట్టిన క్యాండిడేట్లు

మహబూబ్​నగర్, వెలుగు: సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పటికే మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో ప్రచార పర్వం జోరుగా సాగుతుండగా.. ఆదివారం నుంచి రెండో విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లోనూ ప్రచారం ప్రారంభమైంది. దీంతో క్యాండిడేట్లు ఓటర్లను కలిసేందుకు ఇంటిబాట పట్టారు. తమకు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు. తమను గెలిస్తే పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. 

రెండో విడతలో ఇలా..

రెండో విడత నామినేషన్లకు సంబంధించి విత్ డ్రాలు పూర్తి కావడంతో ఫైనల్​ లిస్ట్​ను ఆఫీసర్లు రిలీజ్​ చేశారు. దీని ప్రకారం నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద, మరికల్, ధన్వాడ, మరికల్​ మండలాల్లోని 95 జీపీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 10 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 85 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో 268 మంది సర్పంచ్​ క్యాండిడేట్లు బరిలో నిలిచారు. 95 గ్రామ పంచాయతీల్లో 900 వార్డులు ఉండగా, 4 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 224 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 672 వార్డులకు 1,755 మంది పోటీ పడుతున్నారు. 

మహబూబ్​నగర్​ జిల్లాలోని హన్వాడ, కౌకుంట్ల, దేవరకద్ర, చిన్నచింతకుంట, మిడ్జిల్, కోయిల్​కొండ మండలాల్లోని 151 జీపీలకు ఎన్నికలు నిర్వహించనుండగా, 9 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. 142 జీపీలకు ఎన్నికలు జరగనుండగా, 475 మంది బరిలో నిలిచారు. ఈ మండలాల్లోని 1,334 వార్డులు ఉండగా, 2 వార్డులకు ఒక్క నామినేషన్​ కూడా దాఖలు కాలేదు. 267 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 1,065 వార్డుల్లో 2,871 మంది పోటీ చేస్తున్నారు. ఈ జీపీలకు ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. 

గెలుపే లక్ష్యంగా వ్యూహాలు..

ప్రధాన పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న క్యాండిడేట్లను గెలిపించేందుకు నియోజకవర్గ స్థాయి లీడర్లు రంగంలోకి దిగుతున్నారు. గంప గుత్తగా ఓట్లు పడేలా వ్యూహాలు రచిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో పలుకుబడి ఉన్న లీడర్లను కలుస్తున్నారు. ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా తమ అభ్యర్థికి ఓట్లు వేయించాలని కోరుతున్నారు. వారికి భవిష్యత్​లో అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. 

క్యాండిడేట్లు కూడా ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. యువతను ఆకట్టుకునేందుకు దావత్​లు స్టార్ట్​ చేశారు. స్టేడియాలు, ఇతరత్రా అవసరాలు తీర్చుతామని హామీలు ఇస్తున్నారు. గ్రామ పెద్ద మనుషులను కలిసి సమస్యల గురించి ఆరా తీసి, వాటిని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పాటు తమను గెలిపించాలని కోరుతున్నారు. కుల సంఘాల లీడర్లను కలిసి కమ్యూనిటీ హాళ్లు, కుల దేవతల ఆలయాలు నిర్మించి ఇస్తామని చెబుతున్నారు.

రేపు మూడో విడత విత్ డ్రాలు..

మూడో విడత ఎన్నికలు జరిగే జీపీల్లో నామినేషన్ల స్వీరకణ కంప్లీట్​ అయింది. మెజార్టీ పంచాయతీల్లో పోటీ తీవ్రంగా ఉంది. పలు చోట్ల రెబల్స్​ నామినేషన్లు వేయగా, వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల నామినేషన్లను విత్​ డ్రా చేయించి ఏకగ్రీవం చేయాలనే ఆలోచనతో ప్రధాన పార్టీల లీడర్లు చర్చలు జరుపుతున్నారు. 

మహబూబ్​నగర్​ జిల్లాలో అడ్డాకుల, మూసాపేట, జడ్చర్ల, బాలానగర్, భూత్పూర్  మండలాల్లోని 133 జీపీల్లో మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్​కు 876 మంది నామినేషన్లు వేయగా, 1,152 వార్డులకు 2,966 మంది నామినేషన్లు వేశారు. నారాయణపేట జిల్లాలోని కృష్ణ, మాగనూరు, మక్తల్, నర్వ, ఊట్కూరు మండలాల్లోని 110 జీపీలకు ఎన్నికలు జరగనుండగా, 771 మంది నామినేషన్లు వేశారు. 994 వార్డులకు 2,294 మంది నామినేషన్లు దాఖలు చేశారు.