ముంబైకి ఎదురుందా!

ముంబైకి ఎదురుందా!
  • 42వ టైటిల్​పై గురి
  • నేటి నుంచి మధ్యప్రదేశ్‌‌‌‌తో  రంజీ ఫైనల్‌‌‌‌ మ్యాచ్
  • ​పృథ్వీ షాపై ఫోకస్​
  • ఉ. 9.30 నుంచి స్టార్​ స్పోర్ట్స్​లో లైవ్​

బెంగళూరు:రంజీ ట్రోఫీలో మరెవ్వరికీ సాధ్యంకాని రీతిలో ఇప్పటికే 41సార్లు విజేతగా నిలిచిన ముంబై 42వ టైటిల్‌‌‌‌పై గురిపెట్టింది. డొమెస్టిక్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో అత్యంత బలమైన జట్టయిన ముంబై   బుధవారం మొదలయ్యే రంజీ ఫైనల్లో మధ్య ప్రదేశ్‌‌‌‌తో పోటీ పడనుంది. ఇంటర్నేషనల్‌‌‌‌ లెవెల్లో సత్తా నిరూపించుకున్న ప్లేయర్లతో పాటు ఫ్యూచర్‌‌‌‌ స్టార్లతో నిండిన ముంబై ఫేవరెట్‌‌‌‌గా బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా ఐదు మ్యాచ్‌‌‌‌ల్లోనే 800 ప్లస్‌‌‌‌ రన్స్‌‌‌‌ చేసిన సర్ఫరాజ్‌‌‌‌ ఖాన్‌‌‌‌, గత నాలుగు ఇన్నింగ్స్‌‌‌‌ల్లో మూడు సెంచరీలు సాధించిన యశస్వి జైస్వాల్‌‌‌‌ భీకర ఫామ్‌‌‌‌లో ఉన్నారు. వీళ్లకు తోడు సెహ్వాగ్​ స్టయిల్లో బ్యాటింగ్‌‌‌‌ చేస్తున్న కెప్టెన్‌‌‌‌ పృథ్వీ షాతో ప్రత్యర్థులకు ఎప్పుడూ సవాలే.  గతంలో ఇండియా టెస్టు  ఫస్ట్​ చాయిస్​ ఓపెనర్​గా ఉన్న  షా గాయాలు, ఫామ్​ కోల్పోయి టీమ్​కు దూరమయ్యాడు. ఫైనల్లో సత్తా చాటి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాలని పృథ్వీ పట్టుదలగా ఉన్నాడు. ఇక, తన మామ వసీం జాఫర్‌‌‌‌ వారసత్వాన్ని కొనసాగిస్తున్న అర్మాన్‌‌‌‌ జాఫర్‌‌‌‌ కూడా వచ్చిన ప్రతీ చాన్స్‌‌‌‌ను సద్వినియోగం చేసుకుంటూ బ్యాట్‌‌‌‌తో మెప్పిస్తున్నాడు. సువేద్‌‌‌‌ పార్కర్‌‌‌‌, హార్దిక్‌‌‌‌ తమోరే కూడా జోరు మీదున్నారు. వీళ్లకు తోడు లెఫ్టార్మ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ శామ్స్‌‌‌‌ ములానీ (37 వికెట్లు 292 రన్స్‌‌‌‌), ఆఫ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ తనుష్‌‌‌‌ కొటియన్‌‌‌‌ (18 వికెట్లు, 236 రన్స్‌‌‌‌) బాల్‌‌‌‌తోపాటు బ్యాట్‌‌‌‌తో రాణిస్తున్నారు. గత 30 ఏండ్లలో ఆడిన 12 ఫైనల్స్​లో ముంబై ఒక్కసారే ఓడింది. కాబట్టి ముంబైపై గెలుపు మధ్యప్రదేశ్​కు అంత ఈజీ కాబోదు. 

ఎంపీ జట్టూ బలంగానే..
22 ఏళ్ల విరామం తర్వాత రంజీ ఫైనల్​కు చేరుకున్న మధ్య ప్రదేశ్​ జట్టు ఎలాగైనా తొలిసారి ట్రోఫీ అందుకోవాలని పట్టుదలగా ఉంది. కోచ్‌‌‌‌ చంద్రశేఖర్‌‌‌‌ పండిట్‌‌‌‌ మార్గనిర్దేశంలో జట్టు ఈ మధ్య చాలా మెరుగైంది. స్టార్‌‌‌‌ ప్లేయర్లు వెంకటేశ్‌‌‌‌ అయ్యర్‌‌‌‌, అవేశ్​ ఖాన్​  లేకపోయినప్పటికీ  ఇంత దూరం వచ్చింది. కెప్టెన్​ ఆదిత్య శ్రీవత్సవ టీమ్​ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. స్పిన్నర్​ కుమార్‌‌‌‌ కార్తికేయ (ఐదు మ్యాచ్​ల్లో 27 వికెట్లు) టీమ్​కు వెన్నెముకగా ఉన్నాడు. ఇప్పటికే ఐపీఎల్ చాన్స్​ కొట్టేసిన కార్తికేయ.. క్వార్టర్​ఫైనల్​తో పాటు సెమీఫైనల్లో ఐదేసి వికెట్లు పడగొట్టి జట్టును ముందుకు తీసుకురావడంతో పాటు తన స్పిన్‌‌‌‌తో ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. అతనికి తోడు మరో స్పిన్నర్‌‌‌‌ సరాన్స్‌‌‌‌ జైన్‌‌‌‌ రాణిస్తున్నాడు. పేస్​ విభాగాన్ని  పునీత్​ దాటే నడిపిస్తున్నాడు. ఈ టోర్నీలో ఎంపీ పేసర్లు 47 వికెట్లు పడగొట్టడం విశేషం. దాంతో, అటు స్పిన్​లో ఇటు పేస్​లో ఆ జట్టు సమతూకంలో ఉంది. బ్యాటింగ్​లోనూ ఎంపీ బలంగానే కనిపిస్తోంది.  ఓపెనర్లు యశ్​ దూబే, హిమాన్షు మంచి ఫామ్​లో ఉండగా..  మిడిల్​ ఓవర్లలో 18 ఏండ్ల అక్షత్​ సత్తా చాటుతున్నాడు. ఇక, ఐపీఎల్​తో క్రేజ్​ సంపాదించిన  రజత్‌‌‌‌ పటీదార్‌‌‌‌ రూపంలో మరో నాణ్యమైన బ్యాటర్‌‌‌‌ అందుబాటులో ఉన్నాడు. మరి, ముంబై జోరుకు చెక్‌‌‌‌ పెట్టి ఎంపీ జట్టు ట్రోఫీ గెలుస్తుందో లేదో చూడాలి.