మూసివేత దిశగా పీజీ కాలేజీ! తొమ్మిదేండ్లుగా ఫండ్స్ ఇయ్యని సర్కారు

మూసివేత దిశగా పీజీ కాలేజీ! తొమ్మిదేండ్లుగా ఫండ్స్ ఇయ్యని సర్కారు

సంగారెడ్డి/జోగిపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని పీజీ కాలేజీ మూసివేత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఓయూ పరిధిలో ఐదు కోర్సులతో ప్రారంభమైన కాలేజీలో ఇప్పటికే మూడు కోర్సులు ఎత్తేసింది. తొమ్మిదేళ్లుగా ఫండ్స్ కూడా ఇవ్వడం లేదు.  ప్రస్తుతం రెండు కోర్సులు ఉండగా 82 మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. వీరందరికీ ఒకే ఒక్క రెగ్యులర్‌‌ లెక్చరర్‌‌, మరో ఇద్దరు గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు. కాలేజీని అభివృద్ధి చేయాల్సిన స్థానిక ప్రజాప్రతినిధులు లైట్‌ తీసుకోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని స్టూడెంట్లు ఆరోపిస్తున్నారు. 

1969లో డిగ్రీ కాలేజీగా ఏర్పాటు

ఉమ్మడి జిల్లాలో సిద్దిపేట తర్వాత రెండో డిగ్రీ కాలేజీ 1969లో జోగిపేటలోనే ఏర్పాటు చేశారు. మొదట ప్రైవేట్ యాజమాన్యంతో మొదలైన కాలేజీని తర్వాత ఎయిడెడ్ కాలేజీగా, ఆ తర్వాత నెహ్రూ మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీగా మార్చారు. అందోల్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన అప్పటి డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చొరవతో 2013-–14లో పీజీ కాలేజీని మంజూరు చేయించారు. 2014–-15  అకడమిక్‌ ఇయర్‌‌ నుంచి డిగ్రీ కాలేజీలోనే ఎంబీఏ, ఎంఎస్సీ(ఆర్గానిక్ కెమిస్ట్రీ), ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్), ఎంఏ (ఇంగ్లీష్), ఎంఎల్ఐఎస్సీ కోర్సులు ప్రారంభించారు.  

సిబ్బంది లేకపోవడాన్ని సాకుగా చూపి..

టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించాల్సిన ఓయూ అధికారులు ఇదే అంశాన్ని సాకుగా చూపి ఎంఎస్సీ (మ్యాథ్స్),ఎంఏ (ఇంగ్లీష్), ఎంబీఏ కోర్సులను ఎత్తివేశారు.  ప్రస్తుతం ఎంఎల్ఐఎస్సీ (లైబ్రరీ సైన్స్ రెండేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు), ఎంఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) కోర్సులు మాత్రమే కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ రెండు కోర్సులను కూడా ఎత్తేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇదిలాఉండగా ఓయూ అధికారులు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చొరవతో సంగుపేట వద్ద అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ పక్కన 4.26 ఎకరాల స్థలాన్ని పీజీ కాలేజీ కోసం కేటాయించారు. కానీ, ఉన్న కాలేజీని మూసివేసేందుకు ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని స్టూడెంట్లు అంటున్నారు.  

96 మందికి ముగ్గురే..

పీజీ కాలేజీలో మొత్తం 96 మంది సిబ్బంది పనిచేయాల్సి ఉంది.  టీచింగ్‌లో 32 మంది, నాన్ టీచింగ్‌లో 33 మంది, హాస్టల్ నిర్వహణ కోసం మరో 31 మంది పని చేయాలి. సిబ్బందిని ఒకేసారి కాకుండా దశలవారీగా నియమిస్తామని ఓయూ అధికారులు కాలేజీ ప్రారంభంలో చెప్పినా.. ఇప్పటివరకు  రెగ్యులర్ స్టాఫ్ ఒక్కరిని కూడా నియమించలేదు. టీచింగ్‌లో  ఒక రెగ్యులర్ లెక్చరర్ ఉండగా, మరో ఇద్దరు గెస్ట్ లెక్చరర్లు, నాన్ టీచింగ్‌లో అవుట్ సోర్సింగ్ కింద 16 మంది పనిచేస్తున్నారు.

రూ.26.30 కోట్లు మంజూరైనా.. 

జోగిపేట పీజీ కాలేజీకి 2014లో ప్రభుత్వం రూ.26.30 కోట్లు సాంక్షన్ చేసింది. రికరింగ్ ఫండ్స్ కింద బిల్డింగ్, ఫర్నిచర్, హాస్టల్ సౌకర్యం, ప్రహరీ  ఖర్చులకు రూ.4.26 కోట్లు, జీతాలు, పరిపాలన అవసరాల కోసం నాన్ రికరింగ్ ఫండ్స్ రూ.22.06 కోట్లు మంజూరు చేశారు. కానీ, యూనివర్సిటీ అధికారులు ఆయా ఫండ్స్ రిలీజ్ చేయలేదు. దీంతో బిల్డింగ్ నిర్మాణం జరగలేదు.  టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించలేదు.  కాగా, ఈ ఏడాది కాలేజీకి వచ్చిన బుక్స్, కెమికల్స్ కు సంబంధించిన రూ.2 లక్షల బిల్లులు కూడా చెల్లించకపోవడంతో సదరు కాంట్రాక్టర్ వాటిని తిరిగి తీసుకెళ్లినట్టు తెలిసింది.

ఫండ్స్‌ సమస్య ఉంది

కాలేజీ నిర్వహణకు ఫండ్స్ సమస్య ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నయి.రెండు కోర్సులను స్టూడెంట్లకు బోధిస్తూ ఉన్నంతలో బాగానే నడిపిస్తున్నం. ఇక్కడి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినం. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటం.  
- ప్రవీణ్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపాల్