AI చెప్పిన 'రామాయణం' తారాగణం: రణబీర్, సాయి పల్లవి స్థానంలో ఎవరు?

AI చెప్పిన 'రామాయణం' తారాగణం: రణబీర్, సాయి పల్లవి స్థానంలో ఎవరు?

భారీ బడ్జెట్ తో నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణం' (Ramayana) చిత్రంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ చర్చ జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా యొక్క మొదటి గ్లింప్స్ విడుదలైంది, ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ గ్లింప్స్‌లో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో, యష్ రావణుడిగా మెరిశారు.  సాయి పల్లవి సీతగా, రవి దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమాన్‌గా నటిస్తున్నట్లు ప్రకటించారు. ట్రైలర్ లో విజువల్స్ ఎఫెక్స్,  మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసలు సైతం అందుకుంది. 

అయితే ఈ తారాగణంపై అభిమానుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఫుల్ చర్చ నడుస్తోంది.  కొందరు నటీనటులు తమ పాత్రలకు సరిగ్గా సరిపోయారని ప్రశంసిస్తుంటే, మరింకొందరిపై ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా రణబీర్, సన్నీ డియోల్ పాత్రల విషయంలో అంతగా సరిపోలేరని విమర్శలు వస్తున్నాయి. ఇంకొందరు మాత్రం టీజర్ లేదా ట్రైలర్ విడుదలయ్యే వరకు తమ అభిప్రాయాన్ని వెల్లడించకూడదని భావిస్తున్నారు.

రామాయణంలో పాత్రలు ఎలా ఉండాలంటే?
ఈ గందరగోళం నేపథ్యంలో 'రామాయణం. పాత్రల ప్రాముఖ్యతపై చాలామంది కృత్రిమ మేధస్సు (AI) ను అడగడంమొదలు పెట్టారు.  'రామాయణం' వంటి గొప్ప పురాణ ఇతిహాసానికి తగిన ప్రత్యామ్నాయ తారాగణాన్ని సూచించమని కోరారు. ముఖ్యంగా Chat GPT, Gemini  AI తన సూచనలు, సలహాలను అందించింది. శ్రీరాముడు, సీత, రావణుడు, లక్ష్మణుడు, హనుమాన్ వంటి అత్యంత ప్రతీకాత్మక, సాంస్కృతికంగా ప్రాముఖ్యత కలిగిన పాత్రలకు నటీనటులను ఎంపిక చేయడం అనేది  వారి రూపంలో కాకుండా  గంభీరత, స్క్రీన్ ప్రెజెన్స్, నటనలో లోతు,  సాంస్కృతిక అనుసంధానత మధ్య సమతుల్యతను కోరుతుంది' అని ChatGPT పేర్కొంది. రామాయణం వంటి ఒక గొప్ప ఇతిహాసాన్ని సినిమాగా తీసేటప్పుడు పాత్రలకు సరిపోయే నటులను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. నటులు కేవలం వారి రూపంలోనే కాకుండా, వారి నటనతో, హావభావాలతో ఆ పాత్రల ప్రాముఖ్యతను, లోతును తెలియజేయగలగాలని Gemini AI సూచనలు చేసింది.

శ్రీరాముడి పాత్రకు రణబీర్ కపూర్ బదులు AI సూచనలు
శ్రీరాముడి పాత్రకు 'శోభ, నైతిక అధికారం, సంయమనం కలిగిన బలం, దివ్యమైన ప్రశాంతత' అవసరమని ChatGPT తెలిపింది. ఈ పాత్రకు రామ్ చరణ్ , హృతిక్ రోషన్ లను అగ్ర ఎంపికలుగా సూచించింది. "ముఖ్యంగా 'RRR' తర్వాత, రామ్ చరణ్ క్రమశిక్షణ, ఆధ్యాత్మికతతో కూడిన బలాన్ని ప్రతిబింబిస్తాడు. అతని పేరు కూడా ప్రతీకాత్మకంగా సరిపోతుంది" అని ChatGPT పేర్కొంది. హృతిక్ రోషన్ గురించి మాట్లాడుతూ, "అతను రాజసం, ప్రశాంతమైన బలం కలిగి ఉన్నాడు,  గంభీరమైన పాత్రల్లో ప్రదర్శిస్తాడు" అని AI అభిప్రాయపడింది.  అటు  శ్రీరాముడు ధర్మం, నిగ్రహం, ప్రశాంతత, అచంచలమైన ధైర్యం, దైవికత్వాన్ని కలిగి ఉండాలి. ఆయన ముఖంలో కరుణ, కళ్ళలో స్థిరత్వం, నడకలో రాజసం ఉండాలని Gemini AI తెలిపింది. ఈ పాత్రకు రామ్ చరణ్ , హృతిక్ రోషన్ తో పాటు ప్రభాస్ ను సూచించింది.  ఆయనకు 'బాహుబలి' వంటి చిత్రాలతో పురాణ పాత్రలను పోషించిన అనుభవం ఉంది. ఆయన శారీరక ఆకృతి, గంభీరమైన రూపం రాముడి పాత్రకు సరిపోతాయని సలహా ఇచ్చింది.

సీతాదేవి పాత్రకు ఎవరు న్యాయం చేస్తారంటే?
సీత పాత్రను తెరపైకి తీసుకురావడానికి 'శోభ, స్థితిస్థాపకత, పవిత్రత' అవసరమని ChatGPT తెలిపింది. ఈ పాత్రకు సాయి పల్లవితో పాటు, మృణాల్ ఠాకూర్ ను అగ్ర ఎంపికగా AI సూచించింది. 'సీతా రామం' సినిమాలో ఆమె నటన దీనికి నిదర్శనమని చెబుతూ, మృణాల్ 'అందమైన, భావోద్వేగంగా ప్రతిధ్వనించే, సున్నితత్వం, బలాన్ని కలిగిన పాత్రలను పోషించగలదని' ప్రశంసించింది. దీపికా పదుకొనే, తృప్తి డిమ్రి, అదితి రావు హైదరి కూడా ఈ పాత్రకు సరిపోతారని సూచింది. అటు Gemini AI  సీత పాత్ర స్వభావాన్ని వివరించింది.  సీతాదేవి సౌందర్యం, సహనం, పవిత్రత, అచంచలమైన ధైర్యం కలబోసిన వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ఆమె ముఖంలో అమాయకత్వం, కళ్ళలో లోతైన భావోద్వేగాలు ఉండాలి సూచించింది. ఈ పాత్రలకు సాయి పల్లవితో పాటు మృణాల్ ఠాకూర్ లను ఎంపికతో పాటు కీర్తి సురేష్ పేరును కూడా సెలక్ట్ చేసింది.  'మహానటి' వంటి చిత్రాలతో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. ఆమెలో సహజత్వం, నిగర్వం కనిపిస్తాయని పేర్కొంది. 

రావణుడి పాత్రకు రణవీర్ సింగ్, యష్
లంకేశ్వరుడు రావణుడి పాత్రకు 'ఆకర్షణ, శక్తి, విషాదభరితమైన సంక్లిష్టత' అవసరమని ChatGPT పేర్కొంది. ఈ పాత్రకు రణవీర్ సింగ్, ఫహద్ ఫాసిల్ లను అగ్ర రెండు ఎంపికలుగా సూచించింది. అలాఉద్దీన్ ఖిల్జీ పాత్రలో తన అద్భుతమైన నటనకు ప్రశంసలు పొందిన రణవీర్, 'రావణుడి యొక్క భారీ, నాటకీయమైన భాగాన్ని, అలాగే అతని వేదన, అహాన్ని ప్రదర్శించగలడు' అని ChatGPT అభిప్రాయపడింది. మరోవైపు, ఫహద్ ఫాసిల్ 'విలన్‌గానే కాకుండా, విషాదకరమైన యాంటీహీరోగా కూడా ఉండే సూక్ష్మమైన, మేధస్సు కలిగిన, తీవ్రమైన రావణుడికి తగిన ఎంపిక' అని AI వాదించింది.   రావణుడు  గొప్ప జ్ఞాని, శివభక్తుడు, మహావీరుడు, కానీ అహంకారం, కోరికల చేత పతనమైన వ్యక్తి. ఆయనలో రాజసం, క్రూరత్వం,  సంక్లిష్టమైన విషాదం కలగలిసి ఉండేలా పాత్ర ఉండాలని Gemini AI సూచించింది. ఈ పాత్రలకు  యష్ ను ప్రధమంగా ఎంపిక చేసింది. 'KGF' చిత్రంలో ఆయన చూపిన తీవ్రత, కరిష్మా,  విలక్షణమైన రూపు రావణుడి పాత్రకు బలాన్నిస్తాయని  సలహా ఇచ్చింది. మరో వైపు రణవీర్ సింగ్, ఫహద్ ఫాసిల్ పేర్లను కూడా సూచించింది.

లక్ష్మణుడు, హనుమాన్ పాత్రకు  సరైన నటులు వీళ్లే!
లక్ష్మణుడు సోదర ప్రేమకు, అకుంఠిత దీక్షకు, ధైర్యానికి ప్రతీక. రాముడి పట్ల ఆయనకున్న భక్తి, విధేయత,  కోపాన్ని సమతుల్యంగా చూపగలగే స్వవాభం ఉండాలని  పాత్ర స్వవాభాన్ని Gemini AI పేర్కొంది.  ఈ పాత్రలకు  రవి దూబేను సూచించింది. ఆయన ఇప్పటికే ఈ పాత్రకు ఎంపికయ్యారు. ఆయన టీవీ రంగంలో మంచి నటుడిగా పేరు పొందారు. ఈ పాత్రకు సిద్ధార్థ్ కూడా సరిపోతారని ..  ఆయనకు తీవ్రమైన పాత్రలను, ఎమోషన్స్‌ను పలికించగల సామర్థ్యం ఉందని ఎంపిక చేసింది. మరో వైపు హనుమాన్ పాత్రకు ఉండవలసిన లక్షణాలు తెలిపింది.  హనుమాన్ అపారమైన బలం, భక్తి, విధేయత, వినయానికి ప్రతీక. ఆయన శారీరకంగా ధృడంగా, కానీ ఆత్మలో ప్రశాంతంగా కనిపించాలని Gemini AI పేర్కొంది. దీనికి తగిన నటులు సన్నీ డియోల్.  ఆయన ఇప్పటికే ఎంపికయ్యారు. ఆయనకు భారీ కాయం, బలమైన నటన హనుమాన్ పాత్రకు సరిపోతాయి. ఆయన స్థానంలో  రిషబ్ శెట్టి కూడా సూచించింది. 'కాంతార'లో ఆయన చూపిన అద్భుతమైన శారీరక శ్రమ,  విశ్వాసం హనుమాన్ పాత్రకు సరిపోతాయని ఎంపిక చేసింది.

సుమారు రూ. 835 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'రామాయణం పార్ట్ 1' దీపావళి 2026న విడుదల కానుంది. రెండవ భాగం 2027లో రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారతదేశంలో అత్యంత ఖరీదైన చిత్రంగా రూపుదిద్దుకుంటుంది. ఈ మూవీలో రణవీర్, సాయి పల్లవి, యష్, రవి, సన్నీలతో పాటు వివేక్ ఒబెరాయ్, లారాదత్తా, షీబా చద్దా, కునాల్ కపూర్ వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.  నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియో ఈ మూవీని నిర్మిస్తోంది. ఆస్కార్  విజేతలు ఏ. ఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు.

మొత్తానికి 'రామాయణం' మూవీలో నటీనటుల ఎంపికపై బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ChatGpt, Gemini AI  ఇస్తున్న సూచనలు, సలహాలు కూడా సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. మూవీ మేకర్స్ కూడా కొన్ని పాత్రల విషయంలో ఆలోచించాలని అభిమానులు కూడా సలహా ఇస్తున్నారు.