ఆదివాసీ మహిళల ఆందోళన

 ఆదివాసీ మహిళల ఆందోళన
  • బైండోవర్ కు రాత్రి పూట తీసుకెళ్లి ఫారెస్ట్​ ఆఫీసర్ల అత్యుత్సాహం
  • మంచిర్యాల జిల్లా దండేపల్లి  తహసీల్దార్​ ఆఫీస్​ వద్ద బాధితుల బైఠాయింపు 

దండేపల్లి, వెలుగు:  పోడు సాగు కోసం రిజర్వ్​ఫారెస్ట్​లోని చెట్ల పొదలను తొలగించిన ఆదివాసీ మహిళలను బైండోవర్ చేసిన ఘటన ఆందోళనకు దారితీసింది. ఫారెస్ట్​ఆఫీసర్ల అత్యుత్సాహంపై ఆదివాసీ మహిళలు బైఠాయించి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ పరిధి 380 కంపార్ట్ మెంట్ లోని మామిడిగూడ, దమ్మనపేటకు చెందిన ఆదివాసీ మహిళలు ఇటీవల ఫారెస్ట్ లోని చెట్ల పొదలను తొలగించి ఆ భూముల్లో విత్తనాలు నాటారు. దీంతో గత నెల 27న 9 మంది ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ ఆఫీసర్లు కేసు నమోదు చేశారు. 

సోమవారం రాత్రి 9 గంటల సమయంలో తొమ్మిది మంది మహిళలను బైండోవర్ చేసేందుకు తాళ్లపేట ఎఫ్ ఆర్ఓ సుష్మ రావు, సిబ్బందితో  వెహికల్​లో దండేపల్లి తహసీల్దార్​ఆఫీస్​కు తీసుకెళ్లారు. రాత్రి అయిందని, తాము రేపు వస్తామని చెప్పినా వినకుండా తీసుకొచ్చారని బాధిత మహిళలు తహసీల్దార్​రోహిత్​దేశ్​పాండే వాహనానికి అడ్డంగా బైఠాయించి నిరసనకు దిగారు. వారికి రెండు గ్రామాలకు చెందిన మరికొందరు మహిళలు మద్దతు పలికారు. తహసీల్దార్ జోక్యం చేసుకుని ఫారెస్ట్​సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఉదయం గ్రామానికి వస్తానని చెప్పి మహిళలను ఫారెస్ట్​వాహనంలో తిరిగి పంపించారు. రాత్రిపూట మహిళలను బైండోవర్​చేయడంపై తాళ్లపేట ఎఫ్ఆర్ఓ సుష్మ రావు వివరణ కోరగా సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.