జైశంకర్, సిద్ధరామయ్య మధ్య ట్విట్టర్ వార్

జైశంకర్, సిద్ధరామయ్య మధ్య  ట్విట్టర్ వార్

న్యూఢిల్లీ: సూడాన్​లో చిక్కుకుపోయిన మనోళ్లను వెనక్కి రప్పించాలనే అంశంపై విదేశాంగ మంత్రి జైశంకర్, కాంగ్రెస్ మధ్య ట్విట్టర్ వార్​జరుగుతోంది. ఈ విషయాన్ని కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య రాజకీయం చేస్తున్నారని విదేశాంగ మంత్రి జైశంకర్‌‌‌‌‌‌‌‌ చేసిన కామెంట్లను కాంగ్రెస్ తప్పుపట్టింది. ‘‘కొంతమంది దృష్టి ఎప్పుడూ తమ యజమాని పట్ల విధేయతను నిరూపించుకోవడంపైనే ఉంటుంది కానీ, వారు దేశం పట్ల కొన్ని బాధ్యతలు నెరవేరుస్తామని ప్రమాణం చేసిన విషయాన్ని మాత్రం మర్చిపోతారు” అని జైశంకర్​ను ఉద్దేశించి మండిపడింది. 

అసలు ఎట్ల మొదలైందంటే..

‘‘కర్నాటక హక్కీపిక్కీ తెగకు చెందిన 31 మంది సూడాన్​లో చిక్కుకుపోయారు. కొద్దిరోజులుగా వాళ్లంతా తిండిలేక అలమటిస్తున్నారు. వాళ్లను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. వెంటనే వాళ్లను మనదేశానికి తీసుకురావాలి” అని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ, జై శంకర్​కు ట్యాగ్​ చేశారు. మంత్రి జై శంకర్ స్పందిస్తూ.. ‘‘వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దు’’ అని రిప్లయ్ ఇచ్చారు. సూడాన్​లో గొడవలు మొదలైననాటి నుంచే ఖర్తూమ్​లోని ఇండియన్ ఎంబసీ.. అక్కడున్న మనోళ్లతో సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు. సెక్యూరిటీ కారణాల వల్ల వాళ్ల వివరాలు చెప్పలేమన్నారు. దీంతో జైశంకర్​పై సిద్ధరామయ్య ఎదురుదాడికి దిగారు. ‘‘మీరు విదేశాంగ మంత్రి కాబట్టి సాయం కోసం విజ్ఞప్తి చేశాను. మీరు భయాందోళనలో బిజీగా ఉంటే దయచేసి మా రాష్ట్ర ప్రజలను తిరిగి తీసుకురాగలిగే వ్యక్తి ఎవరో చెప్పండి” అని బుధవారం ట్వీట్ చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పందిస్తూ.. సిద్ధరామయ్య న్యాయంగా సాయం కోరితే, విదేశాంగ మంత్రి నుంచి భయంకరమైన 
స్పందన వచ్చిందని ట్వీట్ చేశారు.