తన కూతుళ్లకు న్యాయం కోసం సీఎంపై పోటీకి దిగింది

తన కూతుళ్లకు న్యాయం కోసం సీఎంపై పోటీకి దిగింది

 కేరళలో ధర్మదాం నుంచి పోటీ చేస్తున్న వలయార్‌‌ అక్కాచెల్లెళ్ల తల్లి
2017లో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారులు 


కన్నూర్‌‌ (కేరళ): కొన్ని ఎన్నికల గుర్తులు మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. ఇంకొన్ని ఆలోచింపజేస్తుంటాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో ఓ క్యాండిడేట్‌‌కు ఇచ్చిన ఫ్రాక్ సింబల్‌‌ అక్కడి జనాలను కంటతడి పెట్టిస్తోంది. ఓ విషాద సంఘటనను గుర్తు చేస్తోంది. కేరళలోని వలయార్‌‌లో 2017లో అక్కాచెల్లెళ్లయిన ఇద్దరు అమ్మాయిల (13, 9 ఏళ్లు)పై కొందరు అత్యాచారం చేసి చంపేశారు. 13 ఏండ్ల చిన్నారిపై 2017 జనవరిలో అత్యాచారం చేసి ఆమె ఇంట్లోనే దూలానికి వేలాడదీశారు. 2 నెలల తర్వాత ఆ అమ్మాయి చెల్లెలు కూడా ఇలానే వేలాడుతూ కనిపించింది. దీనిపై అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఆ చిన్నారుల తల్లే ఇప్పుడు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌‌కు పోటీగా ధర్మదాం నుంచి బరిలో దిగుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమెకు ఫ్రాక్ గుర్తు వచ్చింది.
నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు
‘నా కుటుంబానికి జరిగిన అన్యాయంపై సీఎం అసలు మాట్లాడలేదు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు, నా కూతుళ్లకు న్యాయం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ఎమ్మెల్యేనో, మినిస్టరో అవడానికి కాదు’ అని ఆ చిన్నారుల తల్లి చెప్పారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని 2019లో కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆ తీర్పుపై ఆందోళనలు వెల్లువెత్తడంతో కేరళ సర్కారు హైకోర్టులో అప్పీలు చేసింది. తన కూతుర్లకు న్యాయంచేయాలని ఆందోళన చేస్తున్న ఆ చిన్నారుల తల్లి.. జనవరి 26 నుంచి పాలక్కడ్‌‌లో సత్యాగ్రహం దీక్ష చేపట్టారు. గత నెల గుండు గీయించుకుని నిరసన తెలిపారు.