బాలీవుడ్ నేపథ్య గాయని జగ్జీత్ కౌర్ మృతి

బాలీవుడ్ నేపథ్య గాయని జగ్జీత్ కౌర్ మృతి

ముంబయి: బాలీవుడ్ నేపథ్య గాయని జగ్జీత్‌ కౌర్‌ (93) ఇవాళ ఉదయం కన్నుమూశారు. రెండేళ్ల క్రితం భర్త చనిపోయినప్పటి నుంచి వృద్ధాప్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆమె ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో జుహూ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్ తొలితరం ప్రముఖ సంగీత దర్శకుడు ఖయ్యూంకు ఈమె భార్య. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్, ఈస్ట్ మన్ కలర్ సినిమాలు మొదలవుతున్న రోజుల్లో జగ్జీత్‌ కౌర్‌ పాడిన పాటలు కొన్నే అయినా.. చిరస్థాయిగా నిలిచిపోయే పాటలు పాడారు. 
1950లో పంజాబీ సినిమాల ద్వారా ఆమె సినీరంగ ప్రవేశం చేశారు. అప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ గా బాలీవుడ్ లో స్థిరపడిన మ్యూజిక్ డైరెక్టర్ ఖయ్యూంను 1954లో ఆమె పెళ్లి చేసుకున్నారు. పెళ్లయినా అడపా దడపా పాడుతూ జగ్జీత్ కౌర్ పాటల కంపోజింగ్‌లో భర్త ఖయ్యూమ్‌కు చేదోడు వాదోడుగా నిలిచారు. 1981లో ‘‘ఉమ్రావ్ జాన్’’ కు అద్భుత స్వరాలు సమకూర్చారు. 1982లో విడుదలైన  ‘‘బజార్’’ సినిమాలో ఈమె పాడిన దేఖ్ లో ఆజ్ హమ్ కో’’ పాటకు మంచి ఆదరణ లభించింది.  తన కెరీర్ కంటే భర్తకు చేదోడు వాదోడుగా నిలవడానికే ప్రాముఖ్యత ఇచ్చిన ఆమె ఖయ్యూం బాలీవుడ్ లో మంచి పేరు సంపాదించడానికి కారణమయ్యారు. ఖయ్యూం సృష్టించిన అద్భుత సంగీతం వెనుక జగ్జీత్ కౌర పాత్ర విస్మరించలేనిది. ఆమె భర్త 2019లో ఆగస్టు 19న మృతి చెందడంతో ఈమె ఒంటరితనంతో సతమతం అవుతూ వచ్చారు. మరో నాలుగు రోజుల్లో భర్త మరణించిన రెండో వార్షికదినోత్సవానికి ముందే ఆమె తుదిశ్వాస విడిచారు.