
జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్లో భారీ వాహనాల రాకపోకలపై ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేయడంపై ఆయా పార్టీలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాయి. తమ పార్టీ పోరాటం ఫలితంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నాయి. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పోరాట ఫలితంగానే అంక్షలు తొలగిపోయాయని కాంగ్రెస్ ఆధ్వర్యంలో జన్నారం మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ మండల ప్రెసిడెంట్ ముజాఫర్ అలీఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, నేతలు శంకరయ్య, ఇందయ్య, పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంక్షలు ఎత్తి వేయాలని సామాజిక కార్యకర్త శ్రీరాములు భూమాచారి, బీజేపీ నేత బద్రినాయక్ మండల కేంద్రంలో గత 27 రోజులుగా రిలే నిరహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. తన దీక్ష వల్లనే ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేసిందని బీజేపీ, బీఆర్ఎస్, కుల సంఘాల నాయకులతో భూమాచారి, బద్రినాయక్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారితో దీక్ష విరమింపజేసి సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రెసిడెంట్ మధుసూదన్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి భరత్ కుమార్, మండల జనరల్ సెక్రటరీ జనార్దన్, నాయకులు విజయ్ ధర్మా, ఫజల్ ఖాన్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.