కాంగోలో ఘోరం: బ్రిడ్జి కూలి 30 మందికి పైగా మృతి, చూస్తుండగానే దారుణం..

 కాంగోలో ఘోరం: బ్రిడ్జి కూలి 30 మందికి పైగా మృతి, చూస్తుండగానే దారుణం..

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) లో  దారుణమైన ఘటన జరిగింది. నవంబర్ 15 అంటే గత శనివారం రోజున లువాలాబా ప్రావిన్స్‌లోని రాగి (కాపర్), కోబాల్ట్ గని దగ్గర వంతెన కూలిపోయి సుమారు 32 మంది చనిపోయారు. అలాగే ఈ ప్రమాదంలో ఎంతో మంది గాయపడ్డారు. స్థానిక సమాచారం ప్రకారం, ఆగ్నేయ కాంగోలోని ఈ గని వంతెనపై జనం ఎక్కువ అవ్వడం వల్లే కూలిపోయిందని చెబుతున్నారు.

ఈ భయంకరమైన ప్రమాదం జరిగిన దృశ్యం వీడియోలో రికార్డయి ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతుంది. TRT వరల్డ్ ప్రకారం, సైనికులు కాల్పులు జరపడం వల్ల ప్రజల్లో భయం మొదలైంది, ఆ తర్వాతే వంతెన కూలిందని అధికారులు అంటున్నారు. ఈ వంతెన ములాండో ప్రాంతంలోని కలాండో గని దగ్గర ఉంది. కొన్ని నివేదికలు అయితే, దాదాపు 70 మంది చనిపోయి ఉండొచ్చని కూడా చెబుతున్నాయి.

ప్రావిన్స్ ఇంటర్నల్ మినిస్టర్  రాయ్ కౌంబా మయోండే మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో  ప్రజలు వంతెనపైకి రాకుండా ప్రభుత్వం అడ్డుకుందని తెలిపారు. కానీ, అక్రమంగా మైనింగ్ చేసేవారు క్వారీలోకి వెళ్లడానికి ప్రయత్నించారని ఆయన అన్నారు.

అయితే, కాంగో ఆర్టిసానల్ మైనింగ్ సర్వీస్ (SAEMAPE) మాత్రం వేరే కారణం చెబుతోంది. సైనికులు కాల్పులు జరపడం వల్ల గని కార్మికుల్లో భయం పెరిగింది. దింతో వారు ఒక్కసారిగా వంతెన వైపు పరుగులు తీయడం వల్ల ఈ విషాదం జరిగిందని అంటున్నారు.

 కోబాల్ట్ ఉత్పత్తిలో కాంగో ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉంది. ఈ ఖనిజాన్ని ఎలక్ట్రిక్ కార్లలో వాడే లిథియం-అయాన్ బ్యాటరీల తయారీకి ఉపయోగిస్తారు. కాంగోలో తయారయ్యే కోబాల్ట్‌లో దాదాపు 80 శాతం చైనా కంపెనీల ఆధీనంలో ఉంది.