- శాతవాహన మాజీ వీసీ మల్లేశం, కేయూ మాజీ వీసీ తాటికొండ రమేశ్ హయాంలో అవకతవకలు
- ఆడిట్ అభ్యంతరాలపై నో రిప్లై
- ఇష్టారాజ్యంగా అడ్జంక్ట్ ఫ్యాకల్టీ నియామకాలు
- ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో అక్రమాలు
- చర్యలు తీసుకోవాలని ఆయా వర్సిటీల వీసీలకు రిపోర్టులు పంపిన ఉన్నత విద్యాశాఖ
కరీంనగర్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీ మాజీ వీసీ మల్లేశం, కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ తాటికొండ రమేశ్‌పై విజిలెన్స్ ఎంక్వైరీ ఎట్టకేలకు పూర్తయింది. వీరి హయాంలో పలు అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. యూనివర్సిటీలో వివిధ అభివృద్ధి పనులు, నిర్వహణ వ్యయంపై ఆడిట్ అభ్యంతరాలకు రిజిస్ట్రార్, ఫైనాన్స్ ఆఫీసర్ రిప్లై ఇవ్వపోవడాన్ని విజిలెన్స్ తప్పుబట్టింది. యూనివర్సిటీలో అడ్జంక్ట్ ఫ్యాకల్టీగా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా రిక్రూట్ మెంట్ చేయడం, ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో ఆన్సర్ షీట్ల స్కానింగ్ వర్క్ ను ఎలాంటి టెండర్ లేకుండా ఓ కంపెనీకి అప్పగించడాన్ని తప్పుగా విజిలెన్స్ గుర్తించింది. ఐదుగురు కాంట్రాక్ట్ లెక్చరర్లను తప్పుడు పద్ధతిలో టర్మినేట్ చేసినట్లు నివేదికలో పేర్కొంది. ప్రభుత్వానికి అందిన ఈ విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవాలంటూ ఉన్నత విద్యాశాఖ ఆయా వర్సిటీల వీసీలకు లేఖ రాసింది. వీసీలు ఈ రిపోర్టులను ఈసీలో పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు.
నియామకాల్లో అక్రమాలు..
శాతవాహన యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై ఎంక్వైరీ చేయాలని సామాజిక కార్యకర్త కోట శ్యాం కుమార్ 2024లో విజిలెన్స్ డీజీకి 16 అంశాలతో కూడిన ఫిర్యాదు ఇచ్చారు. దీంతో ఎంక్వైరీ చేపట్టగా పలు అక్రమాలు వెలుగు చూశాయి. సోషియలాజీ, ఇంగ్లిష్, కామర్స్, బిజినెస్ మేనేజ్ మెంట్, తెలుగు, కెమిస్ట్రీ విభాగాల్లో ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఆరుగురు రిటైర్డ్ ప్రొఫెసర్లను అడ్జంక్ట్ ఫ్యాకల్టీగా నియమించడాన్ని విజిలెన్స్ తప్పుబట్టింది. 2009 రిక్రూట్ మెంట్ లో కెమిస్ట్రీ విభాగంలో ఓ మహిళా ప్రొఫెసర్ తప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ తో ఉద్యోగంలో చేరినట్లు ఎంక్వైరీలో తేలింది. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నారు. ఫైనాన్స్ ఆఫీసర్ గా అర్హత లేకపోయినా రవీందర్ ను ఎఫ్‌వోగా నియమించడం, 2019లో ఎఫ్‌వోగా రిజైన్ చేసిన ఆయనను మళ్లీ 2021లో ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా తీసుకోవడాన్ని విజిలెన్స్ తప్పుబట్టినట్లు తెలిసింది.
ఆడిట్ ఆబ్జక్షన్స్ కు నో రిప్లై..
శాతవాహన యూనివర్సిటీ మాజీ వీసీ హయాంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, అధికార యంత్రాంగం వెహికల్స్ నిర్వహణ, డీజిల్ బిల్లులు, వీసీ రెసిడెన్సీ నిర్వహణ తదితరాల కోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. ఈ విషయమై తీవ్ర స్థాయిలో ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆడిట్ ఆఫీసర్ల అభ్యంతరాలపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వరప్రసాద్, ఫైనాన్స్ ఆఫీసర్ రవీందర్ ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడాన్ని విజిలెన్స్ తప్పుబట్టింది. కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేయడం వల్లే రిప్లై ఇవ్వలేదని తెలిసింది. బాధ్యుల నుంచి రికవరీకి సిఫార్సు చేసినట్లు సమాచారం. అలాగే ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో ఆన్సర్ షీట్ల స్కానింగ్ వర్క్ ను ఎలాంటి టెండర్ లేకుండా ఓ ఏజెన్సీకి అప్పగించడాన్ని విజిలెన్స్ తప్పుబట్టింది.
ఎంక్వైరీకి రెండేళ్లు.. చర్యలకు ఎన్నాళ్లో.. ?
విజిలెన్స్నివేదిక ఆధారంగామాజీ వీసీ ప్రొఫెసర్ సంకశాల మల్లేశం (రిటైర్డ్), మాజీ రిజిస్ట్రార్ వరప్రసాద్, మాజీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ శ్రీరంగ ప్రసాద్, మాజీ ఎఫ్‌వో రవీందర్(రిటైర్డ్) తోపాటు కెమిస్ట్రీ ప్రొఫెసర్ పై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈసీలో చర్చించి మాజీ వీసీ మల్లేశంపై చర్యలు కోరుతూ గవర్నర్ కు సిఫార్సు చేయడంతోపాటు మిగతా ముగ్గురిపై యూనివర్సిటీ స్థాయిలో చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. కెమిస్ట్రీ ప్రొఫెసర్ నియామకం చెల్లుబాటుపై ప్రభుత్వానికి నివేదించనున్నట్లు సమాచారం. అయితే ఎంక్వైరీతోనే రెండేళ్లు గడిచిపోయిందని, ప్రస్తుత వీసీ ఉమేశ్‌కుమార్ త్వరగా చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, సామాజిక కార్యకర్త కోట శ్యాం డిమాండ్ చేశారు.
అక్రమాలకు కేరాఫ్ గా కేయూ మాజీ వీసీ రమేశ్..
కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ తాటికొండ రమేశ్హయాంలో అక్రమాలు జరిగింది నిజమేనని విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది. రూల్స్ కు విరుద్ధంగా తానే ప్రమోషన్ల కమిటీకి చైర్మన్ గా ఉండి తనకు తానే సీనియర్ ప్రొఫెసర్ గా ప్రమోషన్ ఇచ్చుకోవడాన్ని విజిలెన్స్ తప్పుబట్టింది. రిటైర్డయిన ఎస్డీఎల్సీఈ ప్రొఫెసర్ శ్రీనివాసరావును రిజిస్ట్రార్ గా నియమించడం అక్రమమేనని తేల్చింది. శ్రీనివాసరావు సైతం సీనియర్ ప్రొఫెసర్ గా అర్హత లేకపోయినా, నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్ పొందడాన్ని తప్పుబట్టింది. దీంతో సీనియర్ ప్రొఫెసర్లుగా తాటికొండ రమేశ్, శ్రీనివాస రావు పొందిన బెన్ఫిట్స్ ను రికవరీ చేయనున్నారు. రమేశ్ హయాంలో ఏఆర్ గా పని చేసిన పెండ్లి అశోక్ బాబు ఇల్లు కూడా యూనివర్సిటీ స్థలంలోనే ఉందని విజిలెన్స్ తేల్చింది. ఆ స్థలాన్ని యూనివర్సిటీ స్వాధీనం చేసుకోవాలని, అశోక్ బాబుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఇప్పటికే ఈ నివేదికపై కేయూ ఈసీలో చర్చించి చర్యలకు సిద్ధమయ్యారు.
