భావి తరాలకు ఆశా కిరణం: మోదీ

భావి తరాలకు ఆశా కిరణం: మోదీ

న్యూఢిల్లీ :  ఆర్టికల్​370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​షా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ.. ‘‘ఆర్టికల్‌‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు నేడు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం. భారత పార్లమెంట్‌‌ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు రాజ్యాంగబద్ధంగా సమర్థించింది. జమ్మూకాశ్మీర్‌‌, లద్దాఖ్‌‌ సోదర సోదరీమణుల ఆశలు, ఐక్యత, పురోగతిని ప్రతిధ్వనించే ప్రకటన ఇది. భారతీయులుగా మనమెంతో గర్వపడే ఐక్యతను కోర్టు మరోసారి బలపర్చింది. ప్రజల కలలను నెరవేర్చేందుకు మేం నిబద్ధతతో ఉన్నాం. ఆర్టికల్‌‌370తో నష్టపోయిన వారందరికీ మేలు చేస్తాం.

ఈ రోజు తీర్పు రానున్న తరాలకు ఆశాకిరణం. ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానం. బలమైన ఐక్యభారతాన్ని నిర్మించాలనే మన సంకల్పానికి నిదర్శనం’’ అని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్​షా స్పందిస్తూ.. ‘‘ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పును నేను స్వాగతిస్తున్నాను. ఆర్టికల్ 370ని రద్దు చేయాలని మోదీ దూరదృష్టితో కూడిన నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి జమ్మూకాశ్మీర్​లో శాంతి, సాధారణ పరిస్థితులు తిరిగి వచ్చాయి”అని అన్నారు. ఒకప్పుడు హింసతో నలిగిపోయిన కాశ్మీర్​లోయలో వృద్ధి, అభివృద్ధి జీవితానికి కొత్త అర్థాన్ని తీసుకొచ్చాయని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు. పర్యాటకం, వ్యవసాయ రంగాల్లో శ్రేయస్సు జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రజల ఆదాయాలను పెంచిందని షా అన్నారు.  కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘భారత్‌‌లో జమ్మూ కాశ్మీర్‌‌ను సంపూర్ణంగా విలీనం చేయాలని కలలుగన్న జాతీయవాద ప్రజలందరికీ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మరో విజయం అని కొనియాడారు.