ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్ జిల్లా పద్రౌనాలోని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక చిన్న ఎస్‌యూవీ (SUV) వాహనంలో స్కూల్ విద్యార్థులు సామర్థ్యానికి మించి కిక్కిరిసి ప్రయాణిస్తున్న దృశ్యాలు అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి.
స్కూలుకు వెళ్లే చిన్న పిల్లలు ఈ వాహనం లోపల ఇరుక్కుని కూర్చోవడమే కాకుండా, కొందరు విద్యార్థులు వాహనం వెనుక భాగంలో వేలాడుతూ ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడమే ఇలాంటి పరిస్థితులకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
దీనిబట్టి చూస్తే స్కూల్ వాహనాలు పాటించాల్సిన కనీస భద్రతా ప్రమాణాలను కూడా ఇక్కడ పూర్తిగా విస్మరిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ స్కూల్ వాహనం సామర్థ్యానికి మించి పిల్లలను ఎక్కించడం వల్ల ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా భారీ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్తున్న తరుణంలో ఇలాంటి దృశ్యాలు బాధాకరం అని కొందరు, ఆర్టీఓ (RTO) అధికారులు ఏం చేస్తున్నారో? అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు కోరుతుండగా... కుషినగర్ జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి, స్కూల్ కు సురక్షితమైన రవాణా సౌకర్యాలు కల్పించేలా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అధికారులు ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.
