హీటెక్కిన ​వనపర్తి పాలిటిక్స్

హీటెక్కిన ​వనపర్తి పాలిటిక్స్
  • మాజీమంత్రి, ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం
  •  సోషల్​ మీడియాలో హద్దులు దాటి పోస్టింగులు

వనపర్తి, వెలుగు:  వనపర్తి నియోజకవర్గంలో  రాజకీయాలు ఏక్​దమ్​ వేడెక్కాయి. మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మధ్య ఇటీవలి కాలంలో వైరం తీవ్రస్థాయికి చేరింది. వారి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది.   అనుచరులు కూడా  హద్దులు దాటి విమర్శలకు దిగుతున్నారు.  విమర్శలు హద్దులు దాటడం, సోషల్​మీడియాలో  అసభ్యకర పోస్టింగులు వైరల్​ కావడంతో పోలీసులు జోక్యం చేసుకునేదాకా పోయింది.  ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు తప్పుడు కేసులు పెడుతూ తమ కార్యకర్తలను వేధిస్తున్నారని బీఆర్​ఎస్​ ఆరోపిస్తుండగా..  ఇందులో తమ జోక్యం ఏమీ లేదని కాంగ్రెస్​ నేతలు అంటున్నారు. నియోజకవర్గంలో  గతంలో రాజకీయాలు హుందాగా ఉండేవని..   ఎవరూ హద్దులు దాటలేదని.. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే  బాధ కలుగుతుందని సీనియర్​ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

 మాజీమంత్రి నిరంజన్​రెడ్డి,  ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మెన్నటి ఎన్నికల వరకు బీఆర్​ఎస్​లోనే ఉన్నారు. 2023 ఎన్నికలకు ముందు మేఘారెడ్డి కాంగ్రెస్​లో చేరి వనపర్తి నుంచి టికెట్​ సంపాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన నిరంజన్​రెడ్డి మీద విజయం సాధించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిమిద ఒకరు విరుచుకుపడుతున్నారు. వాళ్ల అనుచరులు కూడా పరస్పరం విమర్​శలు చేసుకుంటున్నారు.  దీనికి తోడు సోషల్​మీడియా అసభ్యకరంగా పోస్టులు పెడుతుండడంతో వివాదం ముదురుతోంది. 

 మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లాలో  కబ్జాలకు పాల్పడ్డారని, ఆయనను  పార్టీ నుంచి సస్పెండ్​ చేయాలంటూ ఎమ్మెల్యే మేఘారెడ్డి  ప్రెస్ మీట్​లో  డిమాండు చేశారు. దీంతో బీఆర్​ఎష లీడర్లు కూడా ప్రెస్​మీట్​ పెట్టి కౌంటర్​ ఇచ్చారు.  రెండు పార్టీల నేతల మధ్య ఈ వివాదంపై రచ్చ నడుస్తోంది.  ఇంతలో బీఆర్​ఎస్​కార్యకర్త ఒకరు మూడు రోజుల కింద ఎమ్మెల్యేను టార్గెట్​ చేస్తూ సోషల్​మీడియాలో  చేసిన పోస్టు దుమారం రేపింది. ఈ పోస్ట్​ వైరల్​ కావడంతో  తమ ఎమ్మెల్యేను కించపరుస్తూ సోషల్​ మీడియాలో పోస్టింగులు పెట్టారని కాంగ్రెస్​నేతలు పోలీసులను ఆశ్రయించారు. 

దీంతో పోలీసులు కేసు నమోదు  చేశారు. తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారంటూ బీఆర్​ఎస్​నేతలు కూడా  పోలీస్  స్టేషన్​లో  ఫిర్యాదు చేశారు. బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్​ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.  సోషల్మీడియా వేదికగా అసభ్యకరంగా పోస్టులు పెడుతుండడం,  వ్యక్తిగత విమర్శలు చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.   ఇదిలా ఉండగా,  ఎమ్మెల్యే  మేఘారెడ్డి ఎక్కడిపడితే అక్కడ  తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారంటూ  మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి రూ.10కోట్లకు పరువు నష్టం దావా వేసేందుకు నోటీసులు పంపినట్టు తెలుస్తోంది.  దీంతో వనపర్తి రాజకీయాలు ఎటూ దారి తీస్తుందోనన్న చర్చ 
జరుగుతోంది.