వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు : వాసం వెంకటేశ్వర్లు

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు : వాసం వెంకటేశ్వర్లు

జనగామ, వెలుగు : సీజనల్​ వ్యాధుల నియంత్రణకు పకడ్భందీగా చర్యలు చేపట్టాలని, వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలని, వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించవద్దని సీజనల్ వ్యాధుల నియంత్రణ, పర్యవేక్షణ ఉమ్మడి వరంగల్​ జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, ప్రాజెక్ట్ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆయన జనగామ శివారు చంపక్​ హిల్స్​ హాస్పిటల్​ను కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్, అడిషనల్​ కలెక్టర్​ పింకేశ్​కుమార్​తో కలిసి సందర్శించారు. అక్కడి వైద్య సేవలపై ఆరా తీశారు. మెడికల్​ కాలేజీ ప్రిన్సిపల్ చాంబర్​లో సిబ్బందితో రివ్యూ నిర్వహించి మాట్లాడారు. 

సీజనల్​ వ్యాధులపై ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. వైద్య, మున్సిపల్, పంచాయతీ, తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతీ గ్రామంలో శానిటేషన్​ పక్కాగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీబీ ముక్త్​ భారత్ అభియాన్ క్రింద ప్రతి ఇంటికీ వెళ్లి స్క్రీనింగ్ చేస్తున్నట్లు కలెక్టర్​ తెలిపారు. ఇప్పటి వరకు 40 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, 54,148 మందికి స్క్రీనింగ్ నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో కావూరి మల్లికార్జున్​రావు, మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్​ డాక్టర్ నాగమణి, ఎంసీహెచ్​ సూపరెంటెండెంట్​రాజలింగం తదితరులు పాల్గొన్నారు.