వరంగల్‍ పోలీస్‍ కమిషనరేట్​కు కొత్త ఆఫీసర్లు

వరంగల్‍ పోలీస్‍ కమిషనరేట్​కు కొత్త ఆఫీసర్లు
  • ఐదుగురు ఏసీపీలు బదిలీ, సిటీలోనే నలుగురు 
  • బాధ్యతలు తీసుకున్న రెండోరోజే బదిలైన సీసీఎస్‍ ఏసీపీ కిరణ్‍ కుమార్‍
  • వివాదాలు వెంటాడినా వరంగల్‍ ఏసీపీ సేఫ్‍
  • ట్రాన్స్​ఫర్లపై కమిషనరేట్‍ పోలీస్‍ వర్గాల్లో చర్చ

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ పోలీస్‍ కమిషనరేట్‍ రెండు నెలల క్రితమే కమిషనర్‍ అంబర్‍ కిషోర్‍ఝా స్థానంలో సన్‍ప్రీత్‍సింగ్‍, ఈస్ట్​ జోన్‍ డీసీపీ రవీందర్‍ స్థానంలో అంకిత్‍ కుమార్‍ బాధ్యతలు తీసుకోగా, సోమవారం ఏకంగా ఐదుగురు ఏసీపీలు బదిలీ అయ్యారు. ఇందులో వారం కిందటే ఇద్దరు ఆఫీసర్లు ఇక్కడికి ట్రాన్స్​ఫర్లు కాగా,  జరిగిన రాష్ట్రవ్యాప్త బదిలీల్లో వారు పూర్తిస్థాయిలో ఇక్కడే బాధ్యతలు చేపట్టారు.  ఇంకో ఆఫీసర్‍ పది రోజుల్లో మూడుచోట్లకు బదిలీ అయ్యారు. 

బాధ్యతలు తీసుకున్న రెండోరోజే అతడు బదిలీ కాగా, ఆయన స్థానంలో గతంలో స్థానికంగా పనిచేసిన అధికారి వచ్చారు. ఇక గ్రేటర్‍ పరిధిలో నిత్యం ఏదో ఒక వివాదంతో ఉంటూవస్తున్న వరంగల్‍ డివిజన్‍ ఆఫీసర్‍ మాత్రం సేఫ్‍గా ఉన్నారు. దీంతో అటు పోలీస్‍ వర్గాలతోపాటు జనాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కాగా, సీపీ, డీసీపీలు, ఏసీపీల ట్రాన్స్​ఫర్లు అయిన నేపథ్యంలో త్వరలో ఇన్​స్పెక్టర్ల బదిలీలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది.

గ్రేటర్‍ లో ఒక్కసారిగా ఆఫీసర్ల బదిలీ

గ్రేటర్‍ సిటీ పరిధిలోని కాజీపేట ఏసీపీ తిరుమల్‍ ఇటీవల హైదరాబాద్‍ హైడ్రా పోలీస్‍ స్టేషన్‍ ఎస్‍హెచ్‍ఓగా బదిలీ కాగా, పది రోజుల కింద ఆయన స్థానంలో హైదరాబాద్ సైబర్‍ సెక్యూరిటీ బ్యూరోలో డీఎస్పీగా ఉన్న పింగిళి ప్రశాంత్‍రెడ్డి వచ్చారు. వరంగల్‍ జిల్లా నర్సంపేట ఏసీపీ వి.కిరణ్‍కుమార్‍ను డీజీపీ కార్యాలయానికి అటాచ్‍ చేసి, ఆ స్థానంలో ఖమ్మం సీసీఆర్‍బీలో ఏసీపీగా ఉన్న పున్నం రవీందర్‍రెడ్డిని నియమించారు. 

ఇటీవలే వారు బాధ్యతలు తీసుకోగా, సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బదిలీల్లో ఈ ఇద్దరు ఆఫీసర్లతోపాటు హనుమకొండ నుంచి కొత్త దేవేందర్‍ రెడ్డి, మామునూర్‍ నుంచి బి.తిరుపతి, సీసీఎస్‍ నుంచి కిరణ్‍కుమార్‍ ట్రాన్స్​ఫర్‍ అయ్యారు. వీరి స్థానంలో హనుమకొండకు రాచకొండ షీ టీంలో పనిచేస్తున్న పి.నర్సింహారావు, మామునూర్‍కు ఖమ్మం ఎస్‍బీలో ఉన్న ఎన్‍.వెంకటేశ్‍, సీసీఎస్‍లోకి సీఐడీ విభాగంలో పనిచేస్తున్న పి.సదయ్య వచ్చారు. 

 వరంగల్లో నందిరామ్‍ 'నాయక్‍'.. 

ట్రైసిటీ పరిధిలో హనుమకొండ, కాజీపేట, వరంగల్‍, మామునూర్‍ డివిజన్లు ఉన్నాయి. ఇందులో వివాదాల్లో ఉండే వరంగల్‍ మినహా మిగతా మూడుచోట్ల కొత్తాఫీసర్లు రానున్నారు. మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహించే వరంగల్‍ లో ఏసీపీగా ఉన్న నందిరామ్​ నాయక్​ ఎప్పుడూ వివాదాల్లో ఉంటారు. ఆయన ట్రాన్స్​ఫర్​ అవుతారంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. గతంలో కొండా సురేఖ పుట్టిన రోజు సందర్భంగా ఓ రౌడీషీటర్‍ ఏర్పాటు చేసిన బర్త్​ డే వేడుకల్లో ఏసీపీ నందిరాం నాయక్‍ పాల్గొన్నారు.  ఇతడి డివిజన్‍ పరిధిలోని పోలీస్‍ స్టేషన్లలో కొండా ప్రధాన అనుచరుడిగా వ్యవహరించే రౌడీషీటర్‍  చెప్పినట్టే ఆఫీసర్లు పని చేస్తారన్న అపవాదు ఉంది.

 సదరు లీడర్‍ రెండ్రోజుల కింద సొంత పార్టీ కార్పొరేటర్‍పై అట్రాసిటీ  కేసు నమోదు చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. తూర్పు నియోజకవర్గంలో మంత్రి ఆధ్వర్యంలో జాబ్‍ మేళా నిర్వహించగా, పోలీసుల వైఫల్యంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ఏసీపీగా నందిరామ్‍ నాయక్‍ బదిలీ అవుతారని భావించగా, అనూహ్యంగా గ్రేటర్‍ వరంగల్‍ నలుగురు ఆఫీసర్లలో అతనొక్కడే ట్రాన్స్​ఫర్‍ అవకపోవడంపై డిపార్టుమెంట్, జనాల్లో చర్చ నడుస్తోంది.

10 రోజుల్లో మూడుచోట్లకు బదిలీ 

వరంగల్‍ జిల్లా నర్సంపేట ఏసీపీగా పనిచేసిన వి.కిరణ్‍కుమార్‍ కేవలం పది రోజుల్లో మూడుచోట్లకు బదిలీ అయ్యారు. ట్రాన్స్​ఫర్లు అనేవి డిపార్టుమెంట్​లో సహజమే అయినా, చివరి బదిలీ వరంగల్లో బాధ్యతలు తీసుకున్నాక రెండోరోజు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇన్నాళ్లు నర్సంపేట ఏసీపీగా ఉన్న కిరణ్‍కుమార్‍  ఈ నెల 8న మొదటగా డీజీపీ కార్యాలయానికి అటాచ్‍ అయ్యారు. 14న తిరిగి వరంగల్‍ కమిషనరేట్‍లోని సీసీఎస్‍ విభాగానికి ఏసీపీగా ట్రాన్స్​ఫర్‍ అయ్యారు. 17న వరంగల్‍ వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం బదిలీల్లో ఇతడి స్థానంలో సదయ్య రావడంతో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే మరోసారి డీజీపీ ఆఫీస్‍కు అటాచ్‍ అయ్యారు.