ప్యాకెట్లపై ‘రెడ్​ వార్నింగ్​’ మంచిదే!

ప్యాకెట్లపై ‘రెడ్​ వార్నింగ్​’ మంచిదే!
  • ప్యాకెట్లపై ప్రింట్​ చేయాల్సిందే..
  • లోపల ఏముందో కస్టమర్​కు తెలియాలి
  • ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ గైడ్​లైన్స్​కు జనం సపోర్ట్​
  • వెల్లడించిన లోకల్​ సర్కిల్స్​ రిపోర్ట్​

న్యూఢిల్లీ: ఉప్పు, చక్కెర, కొవ్వు ఎక్కువ ఉండే ఫుడ్​ ప్యాకెట్లపై ‘రెడ్​వార్నింగ్​’ ప్రింట్​ చేయాలన్న ఫుడ్​ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ) నిర్ణయాన్ని మెజారిటీ జనం సపోర్ట్​ చేస్తున్నారు. ఆహారానికి తప్పకుండా ‘హెల్త్​ స్టార్​ రేటింగ్​’ (హెచ్​ఎస్​ఆర్​) ఉండాలని అంటున్నారు. ఎఫ్​ఎస్​ఎస్​ఏఐ త్వరలో రెడ్​ వార్నింగ్​ విధానాన్ని తేనుంది. హానికర పదార్థాలు ఉన్న ఆహార ప్యాకెట్ల ముందుభాగంలోనే రేటింగ్​ ఇస్తారు. ఈ పద్ధతి గురించి జనం ఏమంటున్నారో తెలుసుకోవడానికి లోకల్​ సర్కిల్స్​ దేశవ్యాప్తంగా సర్వే చేసింది.

ఇందుకోసం 382 జిల్లాలకు చెందిన 11 వేల మంది నుంచి అభిప్రాయాలు తీసుకుంది.  ఎక్కువ చక్కెర, ఉప్పు,  కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారాలపై వార్నింగ్​ ముద్రించడం మంచిదేనని దీనిలో పాల్గొన్న వారిలో 31శాతం మంది  చెప్పారు. ప్రతి ప్రొడక్టుకు దానిలోని కంటెంట్​ ఆధారంగా స్టార్ రేటింగ్ ఉండాలని  20 శాతం మంది చెప్పారు.  అనారోగ్యకరమైన ఆహారాలపై  ఎరుపు రంగు గుర్తును తప్పక ముద్రించాలని దాదాపు 40శాతం మంది స్పష్టం చేశారు.  ఇతర ఆరోగ్యకరమైన ప్రొడక్టులపై ఆకుపచ్చ లేదా నారింజ లేబుల్‌‌‌‌లు ఉండాలని కోరుతున్నారు.  కేవలం 8శాతం మంది మాత్రమే ఫుడ్ ప్యాక్‌‌‌‌ల  లేబులింగ్‌‌‌‌కు తాము వ్యతిరేకమని అన్నారు.
ఎక్కువ తినేది యూతే!
"25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్లు ప్యాకేజ్డ్‌​,  ప్రాసెస్ చేసిన ఫుడ్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. వీటిని విపరీతంగా తింటారు. ఎరుపు, నారింజ లేదా ఆకుపచ్చ వంటి గుర్తులు ఉండటం వల్ల అందులో ఏముందో ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. ఏం తినాలో ఏం తినొద్దో వాళ్లే నిర్ణయించుకుంటారు" అని లోకల్​ సర్కిల్స్​ సర్వే పేర్కొంది. హెల్త్ స్టార్ రేటింగ్‌‌‌‌ను తేవడం వల్ల ప్యాకేజ్డ్‌ ఫుడ్స్ కంపెనీలన్నీ మరిన్ని హెల్దీ ఫుడ్స్‌‌‌‌ తెస్తాయని కామెంట్​ చేసింది.

ఆహారంలోని శక్తి, శాచురేటెడ్​ ఫ్యాట్​, సోడియం, మొత్తం చక్కెర,  ప్రోటీన్,  సహజమైన పదార్థాల వంటి వాటి ఆధారంగా హెచ్​ఎస్​ఆర్ ​రేటింగ్​ ఇస్తుంది. ఆహారంలోని కంటెంట్​ను బట్టి ఒకటి నుంచి ఐదు వరకు స్టార్లలో ఏదో ఒక స్టార్​ రేటింగ్​ ఇస్తుంది. ఫుడ్​ ఎక్స్​పర్టులు, కస్టమర్ల సంఘాలు ఈ పద్ధతిని ఇష్టపడటం లేదు. అయినా కొత్త విధానాన్ని తప్పనిసరి చేయాలని ఎఫ్ఎస్​ఎస్ఏఐ నిర్ణయించుకుంది. ఇలాంటి రేటింగ్​ విధానాన్ని సులువుగా తారుమారు చేయవచ్చని కన్జూమర్​ గ్రూప్స్​ వాదిస్తున్నాయి. ఇందుకు బదులు నేరుగా ‘హెచ్చరికలు’ ముద్రించాలని అంటున్నాయి.