వైన్ బాటిల్స్ కొనండి.. కొనిపియ్యండి.. ప్రతి నెలా రూ.20 వేల జీతం.. కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

వైన్ బాటిల్స్ కొనండి.. కొనిపియ్యండి.. ప్రతి నెలా రూ.20 వేల జీతం.. కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో చేరి ఎందరో మోసపోతున్నా..జనాల్లో మార్పు రావడం లేదు. చైన్ మార్కెటింగ్ "మాయ" అని తెలిసినా కూడా దానికి అట్రాక్ట్ అవుతూ లక్షలకు లక్షలు దారపోస్తున్నారు.  తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం వస్తుందనే ఆశతో గొలుసుకట్టు వలలో చి క్కుకుంటూ నష్టపోతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో ‘వైన్’ బాటిల్ కొనుగోలు పేరిట కొందరు అక్రమార్కులు  కోట్ల రూపాయలు దోచేశారు. పెట్టుబడి పెడితే రెట్టింపు వస్తుందని ఆశచూపి డబ్బులు దండుకుని అదృశ్యమయ్యారు. 

వైన్ బాటిల్ మోసం..

వైన్ కంపెనీలో పెట్టుబడి పెట్టండి.. మీరు ఒక వైన్ బాటిల్ ఖరీదు చేయండి.. 60 రోజుల్లో మూడు రెట్లు ఇస్తాం..కొందరిని జాయిన్ చేస్తే మీకు నెలనెలా జీతం కూడా ఇస్తామన్న ప్రకటనను గుడ్డిగా నమ్మారు. డబ్బు వస్తుందని ఆశతో వేలు, లక్షలు పెట్టుబడి పెట్టారు. కొన్ని రోజుల పాటు చెప్పినట్లుగానే రెట్టింపు పెట్టుబడి ఇచ్చారు. పూర్తిగా నమ్మకం కుదిరే వరకు సకాలంలో చెల్లించారు. పెట్టుబడి వేలకు పెరిగింది. లక్షలకు ఎదిగింది. కోట్లకు చేరువైంది. ఇంకేముంది గొలుసు కట్టు వ్యాపారాన్ని తెంపేసిన నిర్వాహకులు..కస్టమర్ల నుంచి సేకరించిన సొమ్ముతో ఉడాయించారు. బాధితులకు కుచ్చుటోపి పెట్టి దర్జాగా పరారయ్యారు. ఈ వైన్ కంపెనీ మోసంలో  తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఎక్కువగా మంచిర్యాల జిల్లాకు చెందిన వారే ఉన్నట్లు సమాచారం .

Also Read:స్తంభాలు పాతి మూడేళ్లైనా వైర్లు బిగిస్తలేరు

వాట్సాప్ గ్రూప్ ద్వారా ..

ది వైన్ గ్రూప్ (TWG) పేరుతో నిర్వాహకులు ఒక వాట్సప్ గ్రూప్ ను క్రియేట్ చేశారు. కొన్ని నెంబర్లను యాడ్ చేశారు. తాము ఒక వైన్ కంపెనీలో పెట్టుబడి పెడుతున్నామని..గ్రూప్ లో చేరిన వారికి చెప్పారు. వారికి ఓ లింక్ పంపించారు. లింక్ ద్వారా పెట్టుబడి పెట్టాలని సూచించారు. ఒక్క వైన్ బాటిల్ కొనుగోలు చేస్తే 60 రోజుల్లో మూడు రెట్లు ఇస్తామని నమ్మబలికారు. రూ. 85 వేలతో వైన్ బాటిల్ కొంటే ప్రతి రోజూ రూ. 12,300 చొప్పున చెల్లిస్తామన్నారు.  కొద్ది రోజుల పాటు కొంతమందికి సవ్యంగా చెల్లించారు. వీరి మాటలను నమ్మి వేల సంఖ్యలో పెట్టుబడి పెట్టారు. 

చేర్పిస్తే పెట్టుబడితో పాటు.. జీతం..

నిర్వాహకులు అంతటితో ఆగలేదు. ఒక ప్రత్యేకమైన యాప్ను  రూపొందించారు. గోవాలో మేనేజ్ మెంట్ ఉందని చెప్పారు. అక్కడి నుంచి కార్యకలాపాలు జరుగుతాయని  రిమోట్ చేశారు.  వైన్ బాటిల్పై  పెట్టుబడి పెట్టడమే కాకుండా  చైన్ సిస్టంలో 230 మందిని చేర్పిస్తే నెల నెలా రూ. 20  వేల వరకు జీతం వస్తుందని చెప్పారు. దీంతో చాలా మంది తమకు డబ్బులు వస్తాయనే ఆశతో ఇందులో చేరారు. ఆ వైన్ బాటిల్ కొంటే ప్రతి రోజు డబ్బులు ఇచ్చేవారు. మే 30 వరకూ నగదు చెల్లింపు వ్యవహారాలు సక్రమంగా సాగాయి. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదైంది. 

మోసం మీద మరో మోసం..

మే 30 నుంచి వినియోగదారులకు డబ్బులు ఇవ్వడం ఆపేశారు నిర్వాహకులు. డబ్బులు రాకపోవడంపై నిర్వాహకులను కస్టమర్లు మెసేజ్ ద్వారా సంప్రదించారు. అయితే తాము గోవాలో ఉన్నామని, ఢిల్లీలో ఉన్నామని కళ్లబొల్లి మాటలు చెప్తూ బాధితుల నుంచి మరిన్ని డబ్బులు గుంజారు. ఇప్పటి వరకు రావాల్సిన నగదు చెల్లించాలంటే సర్వర్ కొనండి, పేపాల్ కొనండి అంటూ మెసేజ్ చేశారు. రూ.4 వేల నుంచి రూ.20వేల వరకు పెట్టుబడి పెడితే మిగతా డబ్బులు ఇస్తామని ఇంకా  నమ్మబలుకుతున్నారు. దీంతో కొంతమంది ఆ మాటలు కూడా విని రూ. 8 వేలు పెట్టి సర్వర్ కూడా కొన్నారు. మూడు రోజులు గడుస్తున్నా ఇంత వరకు డబ్బులు చెల్లించలేదు. అదేమని అడిగితే మళ్లీ పేపాల్ యాప్ కొనండి.. రెండు గంటల్లో డబ్బులు వస్తాయని చెబుతున్నారు.  దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు.  దీనిపై  ప్రభుత్వం దృష్టిపెట్టి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

రూ. 10 లక్షలు పెట్టింది...మోసపోయింది..

మంచిర్యాల జిల్లాలో ది వైన్ గ్రూప్లో  చాలామంది ప్రజలు ఇందులో డబ్బులు పెట్టుబడి పెట్టి మోసపోయారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, శ్రీరాంపూర్ తదితర ప్రాంతాల్లో ఉన్న వారు తమకు తెలిసిన వారి ద్వారా ఈ గ్రూపులో జాయిన్ అయినట్లు సమాచారం. అప్పులు చేసి, బంగారం అమ్మి మరీ పెట్టుబడి పెట్టారు. మంచిర్యాల పట్టణంలోని ఓ కాలనీకి చెందిన ఒక మహిళ ఏకంగా రూ.10 లక్షలు పెట్టినట్లు తెలుస్తోంది. కేవలం ఆమె పెట్టుబడి పెట్టడమే కాకుండా..మరికొందరిని చేర్పించినట్లు సమాచారం. పట్టణానికి చెందిన ఓ వ్యాపారి సైతం రూ. 4 లక్షల వరకు పెట్టినట్లు సమాచారం. ఇలా చాలా మంది పెట్టుబడి పెట్టి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.