నా భర్త శవాన్ని తెప్పించండి.. ప్రజావాణిలో కలెక్టర్‌కు కన్నీళ్లతో మహిళ వినతి

నా భర్త శవాన్ని తెప్పించండి.. ప్రజావాణిలో కలెక్టర్‌కు కన్నీళ్లతో మహిళ వినతి

నిర్మల్/ఆదిలాబాద్/ఆసిఫాబాద్/నస్పూర్, వెలుగు: పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లి అక్కడ మరణించిన తన భర్త శవాన్ని స్వగ్రామానికి తెప్పించాలని కోరుతూ సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ లో ఓ మహిళ కలెక్టర్​కు మొరపెట్టుకుంది. నిర్మల్​జిల్లా దస్తురాబాద్ మండలం మున్యాలకు చెందిన సురేశ్ కొంతకాలం క్రితం ఉపాధి కోసం ఉజ్బెకిస్తాన్ దేశానికి వెళ్లాడు. ఆయనకు భార్య మమత, ఇద్దరు పిల్లలున్నారు. 22 రోజుల క్రితం సురేశ్​ గుండెపోటుతో అక్కడ చనిపోయాడు. విషయం తెలుసుకున్న సురేశ్ ​కుటుంబం అప్పటి నుంచి తల్లడిల్లుతోంది.

 తన భర్త శవాన్ని ఉజ్బెకిస్తాన్ నుంచి రప్పించాలని కోరుతూ భార్య మమత ఇప్పటికే పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరింది. ఎన్నారై వెల్ఫేర్ అసోసియేషన్​తో పాటు ప్రవాస భారతీయుల సంఘాలను సైతం వేడుకుంది. కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో మమత తన ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం కలెక్టరేట్​కు వచ్చి కలెక్టర్ అభిలాష అభినవ్​కు తన గోడు వెల్లబోసుకుంది. దీంతో స్పందించిన కలెక్టర్​ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. 

డబుల్ ఇండ్ల అక్రమాలపై విచారణ జరిపించాలి

ఖానాపూర్​లోని కొమరం భీమ్ చౌరస్తా వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ, ఎంసీపీఐ(యు), బహుజన కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు కలెక్టర్​కు వినతిపత్రం అందించారు. అంతకుముందు కలెక్టరేట్ వద్ద భారీ స్థాయిలో ధర్నా నిర్వహించారు. 

ఇందిరమ్మ ఇంటి కోసం రూ.50 వేలు డిమాండ్ చేస్తున్నారు

ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం రూ.50 వేలు డిమాండ్ చేస్తున్నారని పలువురు దివ్యాంగులు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షాకు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్​లో నిర్వహించిన గ్రీవెన్స్​లో అర్జీలు అందించారు. ఇంద్రవెల్లి మండలంలోని సట్వాజీగూడ గ్రామానికి చెందిన దివ్యాంగులు సోన్కాంబ్లే దేవిదాస్, బామ్నే ప్రశాంత్, నాందే రామకాంత్ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ కలెక్టర్​కు అర్జీ పెట్టుకున్నారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తమ గ్రామంలో పలుకుబడి ఉన్నవారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని, తాము చేసుకున్న దరఖాస్తులను రిజక్ట్ చేశారని వాపోయారు. ఇండ్లు మంజూరు కోసం రూ.50 వేలు ఇవ్వాలని ఇందిరమ్మ కమిటీలోని కొందరు సభ్యులు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే స్పందించి చర్యలు తీసుకోవా లని కలెక్టర్​ను కోరారు. 

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంచిర్యాల, ఆసిఫాబాద్ కలెక్టర్లు కుమార్ దీపక్, వెంకటేశ్ ధోత్రే సూచించారు. కలెక్టరేట్లలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని, షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ, శ్రీరాంపూర్ ప్రాంతంలో అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని, పట్టా మార్పు చేయాలని, ఉపాధి కల్పించాలని, నష్టపరిహారం ఇప్పించాలని, పట్టా మంజూరు చేయాలని, గురుకులంలో సీటు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తులు  అందజేశారు.