
- మొదట 50 మంది మహిళల ఇండ్లపై రూ.50 లక్షలతో ఏర్పాటు
- నెలకు ఒక్కో మహిళకు రూ.2 వేల నుంచి రూ.3 వేల ఆదాయం
నల్గొండ, వెలుగు: స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వారికి సోలార్ పవర్ యూనిట్లు కేటాయించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ కార్యక్రమం అమలుకు పైలట్‌ప్రాజెక్ట్‌గా నల్గొండ జిల్లా కట్టంగూర్మండలంలోని అయిటిపాముల గ్రామాన్ని ఎంపిక చేసింది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలోని కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్సహకారంతో 50 మంది మహిళా సంఘాల సభ్యులను ఎంపిక చేశారు.
ఒక్కో ప్యానెల్.. 4 యూనిట్ల విద్యుత్
ఇందిరా మహిళా స్వశక్తి కింద 50 మంది మహిళ ఇండ్లపై రూ.50 లక్షలతో స్వచ్ఛ శక్తి ఆఫ్ గ్రిడ్ కోఆపరేటివ్ సోలార్ బ్యాటరీ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఒక్కో యూనిట్ కింద రూ.లక్షతో కిలో వాట్ బ్యాటరీ, 540 వాట్స్ సామర్థ్యం కలిగిన 2 ప్యానెల్స్ అందజేశారు. ఒక్కో ప్యానల్ రోజుకు 4 యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని స్వబ్యాగ్ ల్యాబ్స్ కంపెనీ కొనుగోలు చేస్తోంది. బ్యాటరీలు ఫుల్ అయ్యాక ఆ కంపెనీ ప్రతినిధులు ఇళ్లకే వచ్చి తీసుకెళ్లారు.
మళ్లీ ఖాళీ బ్యాటరీలను తెచ్చి బిగించి వెళ్తారు. బ్యాటరీల స్టేటస్ తెలుసుకునేందుకు అయిటిపాములలో టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. దీనివల్ల బ్యాటరీ పర్స౦టేజ్ వివరాలు ఆన్ లైన్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఒక బ్యాటరీకి 2,000 లైఫ్ సైకిల్స్ ఉన్నాయి. గ్రామంలో స్వబ్యాగ్ ల్యాబ్స్కంపెనీ వారు స్వచ్ఛ శక్తి కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడంతోపాటు వాహనాలకు బ్యాటరీలను అద్దెకు ఇస్తున్నారు.
రూ.16.50కు కొనుగోలు..
ఇంటిపైన సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే సొంత అవసరాలకు కొంత విద్యుత్‌ను వాడుకొని, మిగిలింది ట్రాన్స్ కో కు అమ్ముకునే అవకాశం ఉంటుంది. ట్రాన్స్ కో యూనిట్ కు రూ.3కు చెల్లిస్తుండగా.. స్వబ్యాగ్ ల్యాబ్స్ కంపెనీ రూ.16.50కి కొనుగోలు చేస్తోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సహకారంతో తాము రూపాయి పెట్టుబడి లేకుండా నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేల ఆదాయం పొందుతున్నామని స్వయం సహాయక సంఘాల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.