
- ఆసుపత్రికి తరలించే లోపు మృతి
- సిద్దిపేటలో కలకలం
సిద్దిపేట, వెలుగు: డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరైనా తనకు దక్కకుండా కౌన్సిలర్ అడ్డుకుంటున్నాడని సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం సిద్దిపేటలో జరిగింది. మృతుడి కుటుంబీకుల వివరాల ప్రకారం... సిద్దిపేట పట్టణంలోని 26వ వార్డులో నివాసముంటున్న శిలాసాగరం రమేశ్(35) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పాతికేండ్లుగా సిద్దిపేటలోనే నివాసం ఉండడంతో డబుల్ బెడ్ రూమ్ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు అతని దరఖాస్తును పరిశీలించి డబుల్ మంజూరు చేసినా స్థానిక కౌన్సిలర్ కెమ్మసారం ప్రవీణ్ అడ్డుకుంటూ వచ్చారు.
మూడు జాబితాల్లో రమేశ్ పేరున్నా కౌన్సిలర్ ప్రవీణ్.. అధికారులపై ఒత్తిడి తెచ్చి అతనికి పట్టా లభించకుండా అడ్డుకున్నారు. దీంతో సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ లో ప్రజావాణి లో దరఖాస్తు ఇస్తానని రమేశ్ ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కలెక్టరేట్ కార్యాలయం వెనుక భాగంలో పురుగుల మందు తాగాడు. కౌన్సిలర్ ప్రవీణ్ తనను ఇబ్బందులు పెడుతున్నాడని వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి కుటుంబీకులకు పంపాడు. వెంటనే కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రమేశ్చనిపోయాడని డాక్టర్లు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆసుపత్రి వద్దకు చేరుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రమేశ్ కు భార్య లలిత, ఇద్దరు కొడుకులున్నారు.
బీజేపీకి మద్దతిచ్చాడని కౌన్సిలర్ అక్కసు
ఏడాది క్రితం రమేశ్ భార్యకు ఏఎన్ఎం ఉద్యోగం దక్కాలంటే రూ.2 లక్షలివ్వాలని కౌన్సిలర్ ప్రవీణ్ కోరగా.. రూ.లక్ష చెల్లించామని మృతుడి కుటుంబీకులు తెలిపారు. తర్వాత ఉద్యోగం రాకపోవడంతో డబ్బులు వెనక్కి ఇవ్వాలని రమేశ్ పదేపదే కోరడంతో ప్రవీణ్ డబ్బులు వెనక్కి ఇచ్చాడు. అప్పటి నుంచి ఆయనపై కౌన్సిలర్ కోపం పెంచుకున్నాడన్నారు. ఏడాది క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రమేష్.. బీజేపీఅభ్యర్థికి మద్దతిచ్చాడన్న కోపంతో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరైనా పట్టా రాకుండా కౌన్సిలర్ అడ్డున్నాడని మృతుడి భార్య లలిత ఆరోపించారు.