
ఎండకు ఎండిపోతున్న బావులు, కుంటలు, అడుగంటిపోతున్న భూగర్భజలాలు, ఆశగా ఆకాశం వైపు నాలుగు చినుకులు రాలతాయేమోనని ఎదురుచూసే అమాయక అన్నదాతలున్న ఏడారి లాంటి సరిహద్దు ప్రాంతాలు జహీరాబాద్, నారాయణఖేడ్. తడి కోసం ఈ కరువు నేల కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో సింగూర్, మంజీరా నదితోపాటు చిన్న చిన్న చెరువులు, కుంటలు మినహా.. పెద్దగా నీటి వనరులు కనిపించవు. నారింజ లాంటి చిన్న చిన్న తదితర ప్రాజెక్టులు ఉన్నా.. ఎగువ నుంచి నీటి ప్రవాహాలు తగ్గి ప్రతి ఐదేళ్లలో మూడేళ్లు నీటి లభ్యత కరువై వట్టిపోతున్నయి. అందుకే ఇక్కడి రైతులు ఎక్కువ మంది తమకున్న ఎర్ర, నల్ల రేగడి కమతాల్లో చిరుధాన్యాలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా చెరుకు పండించే ప్రాంతంగా జహీరాబాద్‌కు పేరు ఉంది.
చిగురించి.. మాయమైన "నీళ్ల" కల!
వానాకాలంలో పచ్చజొన్న, పెసర్లు, మినుము, అంతర పంటగా కంది, పెసర, ఉలవలు, కొర్రలు, సామలతో పాటు పలు పంటలు సాగు చేస్తారు. నీటి వసతి లేక ఏడాదిలో ఒక పంట పండడమే గగనమైన ఈ ప్రాంత రైతులు చెరుకు, అల్లం సాగు చేసే రైతన్న సాగు నీటి కోసం చేయని ప్రయత్నం లేదు. అయితే గోదావరి జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించే ప్రయత్నంలో భాగంగా పురుడుపోసుకున్న కాళేశ్వరం ఎత్తిపోతలతో జహీరాబాద్, నారాయణఖేడ్ కరువు నేల రైతుల్లో ఆశలు చిగురించాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా.. కొండపోచమ్మ నుంచి సింగూరు రిజర్వాయర్‌కు జలాలను తరలించి, అక్కడ నీటి లభ్యతను పెంచి తద్వారా పూర్తిగా వెనకబడ్డ నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలు ఉండాలని నాటి సీఎం కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు.సంగారెడ్డి జిల్లాలోని సింగూరు, మంజీరా పరీవాహక ప్రాంతంలో ఉన్న 20కి పైగా మండలాలకు సాగునీరు అందించడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ఎత్తిపోతల పథకాలకు ఆలోచన చేసింది, సర్వే కూడా చేసింది. బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు, నాగల్‌గిద్ద, కంగ్టి, కల్హేర్, సిర్గాపూర్, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గంలోని రేగోడు, వట్‌పల్లి, రాయికోడ్, మునిపల్లి, మండలాల్లోని లక్షా 65 వేల ఎకరాలకు నీటిని అందించేందుకు 8 టీఎంసీల సామర్థ్యంతో ఎత్తిపోతల పనులను కూడా ప్రారంభించింది.
కేసీఆర్ మాటలు తప్ప..
సంగమేశ్వర ద్వారా జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్, జరాసంగం, జహీరాబాద్, న్యాల్‌కల్, మొగుడంపల్లితోపాటు సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట, కొండాపూర్, కంది మండలాల్లోని 2 లక్షల19 వేల ఎకరాలకు నీటిని అందించడానికి 12 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును చేపట్టింది. 2022 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేయగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ దక్కించుకున్నది. కొండ పోచమ్మ ప్రాజెక్టు నుంచి సింగూరులోకి నీటిని మళ్లించి ఎత్తిపోతల ద్వారా సాగునీటిని అందించాలి. దీని కోసం మనూరు మండలం బోరంచ వద్ద పంపుహౌస్ లను నిర్మించే పనులను ప్రారంభించారు. పంపుహౌస్ కోసం కొంత భూమిని సేకరించి, లెవలింగ్ పనులు చేపట్టారు. మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు సింగూర్ ప్రాజెక్టుపై సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామని, ఇందు కోసం తమ ప్రభుత్వం రూ. 4,427 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని పాలకులు అనేక వేదికలపై చెప్పారు. కానీ ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగలేదు. భూసేకరణ, పరిహారం విషయంలో రైతులు కోర్టుకు వెళ్లడంతో ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడింది.
కదలిక రావాలి
2023లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు ప్రాజెక్టుల పనులపై ఆశలు ఏర్పడ్డాయి. దీనిపై మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందిస్తూ.. తక్కువ ఖర్చుతో అధిక ఆయకట్టుకు సాగునీరు అందించే విధంగా మార్పులు చేస్తున్నామని, ప్రతిపాదిత ప్రాజెక్టులను రద్దు చేయలేదని చెప్పారు. కానీ ఇంకా కదలికరాలేదు. గత ఏడాది నవంబర్ నెలలో హైదరాబాద్ జలసౌధలో ఉమ్మడి మెదక్ జిల్లా నీటిపారుదల ప్రాజెక్ట్‌లు, ఎత్తిపోతల పథకాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తూ.. సింగూరు, మంజీరాలకు గోదావరి జలాలు రానున్నాయని.. బసవేశ్వర, సంగమేశ్వర, ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయనున్నట్లు చెప్పారు.
ఇకనైనా ‘తీపి కబురం’దేనా!
తీపిని పంచే చెరుకు.. జహీరాబాద్ రైతన్నకు చేదును మిగుల్చుతోంది. సకాలంలో బిల్లులు చెల్లించక రైతన్నను సంక్షోభంలోకి నెట్టేసిన ట్రైడెంట్ షుగర్స్ ఫ్యాక్టరీ నేడు చేతులు మారడంతో మూతపడిపోయింది. సీఎం పర్యటనతో జహీరాబాద్ లో నూతన ఫ్యాక్టరీ ప్రకటన వస్తుందనే ఆశాభావంతో రైతన్నలున్నారు. ఎన్నికల సమయంలో..ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి నెరవేర్చుకుంటారా.. లేదా అనేదే ఇప్పుడు జహీరాబాద్‌లో ‘టాక్ ఆఫ్ ద టౌన్’గా మారింది.
సీఎం గారూ.. కనికరించండి!
శంకుస్థాపన చేసిన శిలాఫలకాలు.. సర్కారు వైపు దీనంగా చూస్తున్నాయి. కరువు కరాళ నృత్యం చేసే జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంత నేల ఇంకెన్నాళ్లు కన్నీటితో తడవాలి? గోదారమ్మ ఈ నల్లనేలను తడుపుతుంటే.. భూమి నుంచి బువ్వ తీయాలన్న రైతు కోరిక నెరవేరదా? రెండు మూడు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి.. జహీరాబాద్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఈ నేల రైతుల చెమట చుక్కలు, కరువు నేల మట్టి వాసనలైనా సీఎం మనుసు కరిగించి.. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు సంకల్పిస్తారని, జహీరాబాద్ వేదికపై నుంచే అందుకు స్పష్టమైన హామీ ఇస్తారని ప్రజలు ఈ ప్రాంతమంతా ఆశిస్తున్నది.
- పరమేశ్వర్ నాగిరెడ్డిపల్లి,
సీనియర్ జర్నలిస్ట్