
టీ20 వరల్డ్ కప్లో పటిష్ట పాకిస్తాన్ ను పసికూన జింబాబ్వే ఓడించింది. జింబాబ్వే విసిరిన 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పాక్ చతికిలపడింది. 20 ఓవర్లలో 129 పరుగులకే పరిమితమై ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ విజయం క్రికెట్ ప్రపంచంలో పెనుసంచలనంగా మారింది. గతంలో వరల్డ్ కప్ లో టైటిల్ హాట్ ఫేవరెట్ వెస్టిండీస్‌ను ఓడించిన ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. అటు ఈ మ్యాచ్ లో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడానికి జింబాబ్వే ప్లేయర్లు చూపించిన తెగువపై ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రికెట్ అభిమానులు జింబాబ్వే జట్టును అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ డాంబుడ్జో చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ట్రెండింగ్లోకి మిస్టర్ బీన్...
మ్యాచ్ తర్వాత మిస్టర్ బీన్ రొవాన్ అట్కిన్సన్ పేరు ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ పదాన్ని స్వయంగా జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ డాంబుడ్జో ఉపయోగించడం విశేషం. దీనికి కారణం ఏందంటే..2016లో జింబాబ్వే రాజధాని హారారెలోని కాన్ఫరెన్స్ సెంటర్‌లో జరిగిన ఓ కామెడీ షోలో ఆ దేశ ప్రజలను పాక్ అవమానించింది. రోడ్‌షోలో మిస్టర్ బీన్ పోలిన పాకిస్తాన్ కమెడియన్ ఆసిఫ్ మహ్మద్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే జింబాబ్వే ప్రజలు అతడినే రియల్ మిస్టర్ బీన్ అనుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు..ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికోసం ఏకంగా10 డాలర్లను చెల్లించారు. ఆ తర్వాత నిజం తెలుసుకున్నారు. పాక్ చేసిన మోసానికి జింబాబ్వే ప్రజలు లబోదిబోమన్నారు.
రియల్ మిస్టర్ బీన్‌ను పంపండి...
తాజా విజయంతో...పాక్ కు జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ డాంబుడ్జో చురకలంటించాడు. నెక్స్ట్ టైమ్ రియల్ మిస్టర్ బీన్‌ను పంపించాలంటూ ట్వీట్ చేశారు. జింబాబ్వే విజయంపై ప్రశంసలు కురిపించాడు. క్రెగ్ ఇర్విన్ సారథ్యంలోని జింబాబ్వే జట్టును అభినందిస్తూ ప్రత్యేక సందేశాన్ని పంపించారు. కంగ్రాట్యులేషన్స్ టు చెవ్రాన్స్ అంటూ ట్వీట్ చేశారు.