
- నామినేషన్లు స్టార్ట్
- ఎంపీడీవో ఆఫీసుల్లో నామినేషన్లు
- చివరి తేదీ ఈ నెల 11 15న నామినేషన్ల ఉపసంహరణకు గడువు
యాదాద్రి, నల్గొండ, వెలుగు: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ గురువారానికి వాయిదా వేసింది. నోటిఫికేషన్ నిలిపివేయాలని స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరినా.. హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో మండల, జిల్లా, మండల పరిషత్ మొదటి విడతలో జరిగే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎంపీడీవో ఆఫీసుల్లో నామినేషన్లను స్వీకరిస్తారు.
దీనికి సంబంధించి ఆఫీసర్లు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ నెల 11 వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 12న నామినేషన్ల పరిశీలన, ఆదే రోజు రాత్రి నామినేషన్లు సక్రమంగా ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. 14న అభ్యంతరాలు పరిష్కరిస్తారు. ఈ నెల 15న నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా అదే రోజు సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా రిలీజ్ చేస్తారు. 23న పోలింగ్ నిర్వహిస్తారు.
ఫస్ట్ విడతలో ఇలా..
యాదాద్రి జిల్లాలో మొదటి విడతలో 10 జడ్పీటీసీ, 84 ఎంపీటీసీలకు సంబంధించి నోటిఫికేషన్ను ఆఫీసర్లు రిలీజ్ చేశారు. ఆలేరు నియోజవర్గంలోని 8 మండలాల జడ్పీటీసీలు, 72 ఎంపీటీసీలు, తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు సంబంధించి రెండు జడ్పీటీసీ, 12 ఎంపీటీసీలకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. 474 పోలింగ్ స్టేషన్లు గుర్తించారు. 2,45,810 మంది ఓటర్లు ఉన్నారు.
నల్గొండ, సూర్యాపేటలో..
నల్గొండ జిల్లాలో 18 జడ్పీటీసీలు, 196 ఎంపీటీసీ స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు నిర్వహిస్తారు. పోలింగ్ స్టేషన్లు 1099 ఏర్పాటు చేశారు. ఓటర్లు 6,00,316 మంది ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 112 ఎంపీటీసీలు, 11 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. సూర్యాపేట డివిజన్ పరిధిలోని 249 గ్రామాల్లో ఎన్నికలు జరగనుండగా 616 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 3,32,962 మంది ఉన్నారు.