
- ఉదయం స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ఫారాలు
- తీసుకున్న ఆశావహులు
- యాదాద్రిలో 11, నల్గొండలో 2 రెండు నామినేషన్లు దాఖలు
- సూర్యాపేటలో నిల్..
- జీవో 9పై హైకోర్టు స్టేతో అంతటా సైలెన్స్
యాదాద్రి, నల్గొండ, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి అభ్యర్థులు పోటీ పడటంతో ఉమ్మడి జిల్లాలో గురువారం ఉదయం సందడి వాతావరణం నెలకొనగా.. సాయంత్రానికి జీవో 9పై హైకోర్టు స్టే విధించడంతో ఒక్కసారిగా సైలెన్స్‌గా మారిపోయింది. ఉదయం నుంచి యాదాద్రి జిల్లాలో పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. మరికొందరు ఆశావహులు నామినేషన్లు వేయడానికి రెడీ అవుతున్న సమయంలో హైకోర్టు స్టే విధించడంతో ఆగిపోయారు.
ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్
షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ ఫేజ్‌లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరగాల్సిన 39 జడ్పీటీసీ, 392 ఎంపీటీసీ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. యాదాద్రి జిల్లాలో ఆలేరు నియోజవర్గంలోని 8 జడ్పీటీసీలు, 72 ఎంపీటీసీలు, తుంగతుర్తి నియోకవర్గ పరిధిలోని మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు సంబంధించి రెండు జడ్పీటీసీ, 12 ఎంపీటీసీలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నల్లగొండ జిల్లాలో 18 జడ్పీటీసీలు, 196 ఎంపీటీసీ స్థానాలకు, సూర్యాపేట జిల్లాలో 11 జడ్పీటీసీలు, 112 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
మార్నింగ్సందడే సందడి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బుధవారం హైకోర్టు స్టే విధించక పోవడం, గురువారం ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో ఆశావహుల ఉత్సాహానికి అడ్డులేకుండా పోయింది. గడిచిన వారం రోజులుగా మీటింగ్‌లు నిర్వహించిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు ఆశావహుల పేర్లతో లిస్ట్ రెడీ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ నుంచి అధికారికంగా ఒకే కాకున్నా.. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేయడానికి ఎంపీడీవో ఆఫీసుల్లో చాలామంది నామినేషన్ పత్రాలను తీసేసుకున్నారు. బ్యాంకుల్లో కొత్తగా కరెంట్ అకౌంట్లు తీసుకున్నారు. చివరి రోజు శనివారం పంచమి కావడంతో ఆ రోజు నామినేషన్లు వేయాలని చాలా మంది అనుకున్నారు. అయితే రెండో శనివారం బ్యాంకులకు సెలవు కావడంతో ముందు జాగ్రత్తగా గురువారమే కొత్త అకౌంట్లు తీసుకున్నారు.
యాదాద్రిలో 11 నామినేషన్లు.. నల్గొండలో 2, సూర్యాపేటలో నిల్
మంచి రోజు కావడంతో గురువారం కొందరు నామినేషన్లు దాఖలు చేశారు. యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలంలోని మూడు ఎంపీటీసీ స్థానాలకు కాంగ్రెస్ నుంచి నాలుగు, బీఆర్ఎస్ నుంచి ఒక నామినేషన్ దాఖలైంది. బొమ్మల రామారం మండలంలోని రెండు ఎంపీటీసీలకు ఇద్దరు, తుర్కపల్లిలోని రెండు ఎంపీటీసీలకు ఇద్దరు, మోటకొండూరులోని రెండు ఎంపీటీసీలకు ఇద్దరు చొప్పున కాంగ్రెస్ నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. జడ్పీటీసీలకు దాఖలు కాలేదు. నల్లగొండ జిల్లాలో 18 జడ్పీటీసీలు, 196 ఎంపీటీసీ స్థానాలు ఉండగా రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 11 జడ్పీటీసీలు, 112 ఎంపీటీసీ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా వేయలేదు.
బీర్ల ఇంటికి పోటెత్తిన కాంగ్రెస్ లీడర్లు
యాదగిరిగుట్టలోని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇంటికి కాంగ్రెస్ లీడర్లు గురువారం పోటెత్తారు. దసరా పండుగ నుంచి కాంగ్రెస్ లీడర్లకు బీర్ల అయిలయ్య అందుబాటులోకి రాలేదు. దీంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ల విషయంలో పూర్తిగా స్పష్టత రాలేదు.
యాదగిరిగుట్టకు ఎమ్మెల్యే వచ్చారన్న సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఇంటికి చేరుకున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ల విషయంలో ఎమ్మెల్యేను కలిసిన పలువురు స్పష్టమైన హామీ తీసుకున్నారు. అనంతరం నామినేషన్ వేయడానికి పలువురు వెళ్లడం, అప్పటికే జీవో 9పై హైకోర్టు స్టే విధించడంతో నిరాశగా వెనుదిరిగారు.