ఆరేండ్లలో రూ.20 వేల కోట్ల అభివృద్ధి..కరీంనగర్ పార్లమెంట్‌ను నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతా :మంత్రి బండి సంజయ్ కుమార్‌

ఆరేండ్లలో రూ.20 వేల కోట్ల అభివృద్ధి..కరీంనగర్ పార్లమెంట్‌ను నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతా :మంత్రి బండి సంజయ్ కుమార్‌
  • కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్​కుమార్‌

జమ్మికుంట, వెలుగు : కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆరేండ్లలో రూ.20 వేల కోట్లకుపైగా ఖర్చు చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్ తెలిపారు. కేంద్రమంత్రిగా మరిన్ని నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఫస్ట్‌ ప్లేస్‌లో నిలపడమే లక్ష్యంగా పని చేస్తున్నానని చెప్పారు. శనివారం హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పర్యటించిన బండి సంజయ్.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డితో కలిసి వీణవంక, గండ్రపల్లితో పాటు పలు గ్రామాల్లో నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సీఆర్‌ఐఎఫ్‌ కింద రూ. 291 కోట్లతో 1,341 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించామన్నారు. త్వరలోనే కరీంనగర్‌ – జగిత్యాల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టబోతున్నామని, టెండర్ల ప్రక్రియ కూడా మొదలు కాబోతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఆకుల రాజేందర్‌,  తదితరులు పాల్గొన్నారు.