జమ్ముకాశ్మీర్‌లో పేలుడు.. ఒకరు మృతి

జమ్ముకాశ్మీర్‌లో పేలుడు.. ఒకరు మృతి

జమ్మూ కాశ్మీర్‌లో అనుమానాస్పద పేలుడు సంభవించింది.ఉధంపూర్ జిల్లాలోని సలాథియా చౌక్‌లో బుధవారం జరిగిన మిస్టరీ పేలుడులో ఒకరు మృతి చెందగా, పదుల సంఖ్యలో జనం గాయాలపాలయ్యారు.  సలాథియా చౌక్‌లో వెండింగ్ కార్ట్ కింద పేలుడు సంభవించిందని పోలీసు వర్గాలు,స్థానికులు తెలిపారు. ఈ పేలుడులో ఒకరు మృతి చెందగా, మరో 14 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు అధికారులు దీన్ని ధృవీకరించలేదు. మరోవైపు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

ఈ ఘటనపై స్పందించిన ఉధంపూర్ ఎస్ఎస్పీ వినోద్ కుమార్ మాట్లాడుతూ... పేలుడు ఎలా జరిగింది. పేలుడు తీవ్రత ఎంత అన్నది విచారణలో వెల్లడవుతుందన్నారు. వారికి అందిన సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... ఏడుగురు గాయాలపాలైనట్లు తెలిపారు. పేలుడుకు గల కారణం,మూలాన్ని తెలుసుకోవడానికి ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. పేలుడిపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేస్తూ, "ఉదంపూర్‌లోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో "రెహ్రీ" చుట్టూ పేలుడు సంభవించింది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు, 13 మంది గాయపడ్డారు. ఘటనకు సంబంధించి మినిట్ టు మినిట్ అప్ డేట్ కోసం నేను డీసీ శ్రీమతి  ఇందు చిబ్ తో టచ్ లో ఉన్నాను. పేలుడుకు కారణాలు తెలుసుకొనే పనిలో అధికారులు ఉన్నారు. త్వరలో దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది...అని ఆయన పేర్కొన్నారు.