
బీబీసీ ఆఫీసుల్లో మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు బీబీసీ సిబ్బంది నుంచి కంపెనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఇన్ కం ట్యాక్స్ సర్వే ప్రారంభమైన నాటి నుంచి కంపెనీకి చెందిన 10 మంది సీనియర్ ఉద్యోగులు ఆఫీసులోనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఐటీ సర్వే ప్రభావం బీబీసీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారని కంపెనీ ప్రకటించింది.
మంగళవారం ఉదయం 11.30గంటల సమయంలో ఐటీ అధికారులు బీబీసీ ఢిల్లీ, ముంబై ఆఫీసుల్లో సోదాలు మొదలుపెట్టారు. మూడు రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే పూర్తి వివరాలు సేకరించేందుకు ఎంత సమయం పడుతుందన్నది ఇప్పుడే చెప్పలేమని అధికారులు అంటున్నారు.ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్, నిధుల పంపిణీ తదితర అంశాలపై సర్వే నిర్వహిస్తున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది.
ఇదిలా ఉంటే బీబీసీ ఆఫీసులో ఐటీ దాడులపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గుజరాత్ అల్లర్లకు సంబంధించి ప్రధానిపై రూపొందించిన డాక్యుమెంటరీనే ఈ సోదాలకు కారణమంటున్నాయి.