ఆకాశం నుంచి పడ్డ 10 కిలోల ఐస్ గడ్డ

ఆకాశం నుంచి పడ్డ 10 కిలోల ఐస్ గడ్డ

బోస్టన్ : ఎక్కడైనా రాళ్ల వాన పడినప్పుడు మహా అయితే పావు కిలనో, అద్ద కిలనో.. మరీ పెద్దవైతే ఒక కిలోనో బరువుండే ఐస్ గడ్డలు పడటం చూస్తుంటాం. కానీ అమెరికాలోని మసాచూసెట్స్ రాష్ట్రంలోని ఓ ఇంటిపై ఇటీవల అకస్మాత్తుగా పది కిలోలకుపైగా ఉన్న ఓ ఐస్ గడ్డ దభేల్ మని పడ్డది. ఆ దెబ్బకు ఇంటి పైకప్పుపై రెండు ఫీట్ల దాకా బొర్రవడ్డది. లోపలి నుంచి చూస్తే ఇంకొంచెం ఎక్కువే పైకప్పు డ్యామేజ్ అయింది. 

సడెన్ గా ఏదో పడినట్లు పెద్ద సౌండ్ రావడంతో ముందుగా ఇంటి ఓనర్ జెఫ్ ఇల్గ్, అతని భార్య అమీలియా రైన్ విల్లే పరుగెత్తుకుంటూ పై రూంలోకి వెళ్లి చూశారు. అక్కడ తమ ఇద్దరు పిల్లలు గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. ఏం జరిగిందో అర్థం కాక వారు ఇద్దరూ బయటకు వచ్చి చూస్తే ఇంటి లాన్ లో ఐస్ గడ్డలు కనిపించాయి. పైకి చూస్తే ఒక్కటంటే ఒక్కటి మేఘం కూడా లేకపోవడంతో వాన పడటం లేదా మంచు కురవడం వంటి చాన్సే లేదని గుర్తించారు. దీంతో ఆ టైంలో అదే ప్లేస్ మీదుగా బోస్టన్ లోగన్ ఎయిర్ పోర్టుకు వెళ్లిన విమానం నుంచే ఆ ఐస్ గడ్డ పడి ఉంటుందని వారు అంచనాకు వచ్చారు. పొద్దున్నే లేచి మళ్లీ చుట్టూ చూడటంతో అప్పుడు తెలిసింది వాళ్లకు తమ ఇంటి పైకప్పుకు బొక్కపడిన విషయం. 

దీంతో వారు పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ఆదివారం ఓ కథనంలో వెల్లడించింది. అమెరికాలో ఇప్పటివరకూ మహా అయితే కిలో బరువు.. ఎనిమిది, పది ఇంచుల సైజు ఉన్న ఐస్ గడ్డలు పడిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇంత పెద్ద ఐస్ గడ్డ ఆకాశం నుంచి పడటం మాత్రం ఎన్నడూ నమోదు కాలేదని ఆ పత్రిక పేర్కొంది.