అమెరికాలో మరోసారి కాల్పులు.. 10 మందికి గాయాలు

అమెరికాలో మరోసారి కాల్పులు.. 10 మందికి గాయాలు
  • అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన

ఫ్లోరిడా: అమెరికాలో మరోసారి దుండగులు తుపాకులతో రెచ్చిపోయారు. ఫ్లోరిడాలోని లేక్​ ల్యాండ్​లో నలుగురు వ్యక్తులు కారులో నుంచి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 10 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈవివరాలను స్థానిక పోలీసు విభాగం కూడా ధ్రువీకరించింది.

డార్క్​ బ్లూ కలర్​ నిస్సాన్​ లో వచ్చిన నలుగురు దుండగులు.. కారు నడుస్తుండగానే నాలుగు కిటికీ అద్దాలను కిందికి దింపి, తుపాకులతో ఫైరింగ్​ చేశారని దర్యాప్తులో గుర్తించారు. అనంతరం కారు వేగాన్ని పెంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయాలపాలైన వారంతా 20 నుంచి 35 ఏళ్లలోపు వారేనని చెప్పారు. ఆ కారు ఎవరిది ? అందులోని వారెవరు ? అనేది తెలుసుకునే దిశగా దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. అయితే ఈ కాల్పులు జరిగిన చోట మారిజ్వానా అనే డ్రగ్ పడి ఉన్నట్లు గుర్తించారు.