రాయ్ పూర్: చత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో రాత్రికి రాత్రే దొంగలు10 టన్నుల స్టీల్ బ్రిడ్జిని చోరీ చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. కోర్బా సిటీలో నాలుగు దశాబ్దాల క్రితం ధోధిపారా ప్రాంతంలోని వార్డు నెంబర్ 17లో హస్డియో ఎడమకాలువపై 70 అడుగుల పొడవైన స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. దీని బరువు 10 టన్నులకుపైగానే ఉంటుంది. జనవరి 18న ఉదయం నిద్ర లేచిన స్థానికులకు కాలువపై స్టీల్ వంతెన కనిపించలేదు. దీంతో వారు ఈ విషయాన్ని స్థానిక కార్పొరేటర్ లక్ష్మణ్ శ్రీవాస్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గ్యాస్ కట్టర్ల సాయంతో చోరీ
జనవరి17న రాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు గ్యాస్ కట్టర్లను ఉపయోగించి స్టీల్ రెయిలింగ్ లను కట్ చేసినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. అనంతరం వారు స్క్రాప్ గా విక్రయించినట్టు గుర్తించారు. టెక్నికల్ అనాలిసిస్ ఆధారంగా పోలీసులు 15 మందిని అనుమానితులుగా గుర్తించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. స్టీల్ రెయిలింగ్ లను విక్రయించి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దానిని దొంగిలించినట్టు పోలీసుల కస్టడీలో నిందితులు అంగీరించారు. పరారీలో ఉన్న 10 మంది ఆచూకీని గుర్తించడానికి గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
