
Baahubali The Epic : ప్రపంచ సినీ చరిత్రలో భారతీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన చిత్రం'బాహుబలి'( Baahubali ) . తెలుగువారి సత్తాను చాటిచెప్పింది. ఇది విడుదలై దశాబ్దం పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ( SS Rajamouli ) ఒక సంచలన ప్రకటన చేశారు. ఈ అద్భుతమైన సినిమా అనుభవాన్ని మరోసారి థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. అది కూడా ఈసారి ఒకే అద్భుతమైన సినిమా రూపంలో థియేటర్లలోకి రానుంది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు ప్రభాస్ అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.
'బాహుబలి: ది ఎపిక్' – సరికొత్తగా..
భారతదేశ వ్యాప్తంగా ఒక మానియాగా మారిన 'బాహుబలి'కి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, రాజమౌళి 'బాహుబలి: ది ఎపిక్' ( Baahubali The Epic ) పేరుతో రెండు భాగాల చిత్రాన్ని కలిపి ఒకే గ్రాండ్ ప్రెజెంటేషన్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31, 2025న థియేటర్లలోకి రానుంది. ఈ వార్తను రాజమౌళి తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రభాస్ పాత్రలో ఉన్న ఒక కొత్త పోస్టర్‌ను పోస్ట్ చేస్తూ, 'బాహుబలి' ఎన్నో ప్రయాణాలకు ఆరంభం. లెక్కలేనన్ని జ్ఞాపకాలు. అంతులేని స్ఫూర్తి. ఇప్పటికి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రత్యేక మైలురాయిని #BaahubaliTheEpicతో గుర్తు చేసుకుంటున్నాం, రెండు భాగాల కలయికతో రూపొందిన ఈ చిత్రం. అక్టోబర్ 31, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అని పోస్ట్ చేశారు..
Baahubali…
— rajamouli ss (@ssrajamouli) July 10, 2025
The beginning of many journeys.
Countless memories.
Endless inspiration.
It’s been 10 years.
Marking this special milestone with #BaahubaliTheEpic, a two-part combined film.
In theatres worldwide on October 31, 2025. pic.twitter.com/kaNj0TfZ5g
ప్యాన్-ఇండియన్ ప్రభంజనం
ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. భారతదేశం అంతటా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు భారతీయ బ్లాక్‌బస్టర్ కథన శైలిని మరో సారి చాటి చెప్పడానికి రెడీ అవుతోంది. 'బాహుబలి: ది బిగినింగ్' 2015లో, 'బాహుబలి: ది కన్‌క్లూజన్' 2017లో విడివిడిగా విడుదలయ్యాయి. ఇవి రెండు బాక్సాఫీస్ వద్ద రికార్డుల క్రియేట్ చేశాయి. కేవలం దక్షిణ భారతదేశంలోనే కాకుండా, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇది నిజమైన ప్యాన్-ఇండియన్ చిత్రానికి మార్గదర్శకంగా నిలిచింది.
రికార్డుల సృష్టి – భారతీయ సినిమాకు కొత్త బెంచ్‌మార్క్
'బాహుబలి: ది కన్‌క్లూజన్' విడుదలైనప్పుడు, ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డులు సృష్టించింది. ఇది కేవలం తెలుగు చిత్రంగానే కాదు ఒక ప్యాన్-ఇండియన్ మూవీగా మారింది. అంతే కాదు అంతర్జాతీయంగా ఎంతో క్రేజ్ ను సొంతం చేసుకుంది.. ఈ చిత్రం కేవలం బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, భారతీయ సినిమా సాంకేతిక, కథన స్థాయిలను పెంచింది. భారీ విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన నిర్మాణ విలువలు, భావోద్వేగభరితమైన కథనం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. భారతీయ సినిమాకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచి రికార్డులు సృష్టించింది.
కథాంశం, తారాగణం
'బాహుబలి' కథ మహిష్మతి రాజ్యంలోని అధికార పోరాటాల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా బాహుబలి, భల్లాలదేవ సోదరుల మధ్య వైరం ప్రధానాంశంగా చిత్రం తెరక్కించారు. దర్శకదీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్ ( Prabhas ), రానా దగ్గుబాటి ( Rana Daggubati ), అనుష్క శెట్టి ( Anushka Shetty ) , తమన్నా భాటియా( Tamannaah Bhatia ), రమ్యకృష్ట ( Ramya Krishna ), నాజర్, సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు నటించారు. ఈ చిత్రంలో "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?" అనే ఒక్క ప్రశ్నతో ప్రేక్షకులను ఉత్కంఠలో పెంచింది. రెండేళ్ల పాటు చర్చనీయాంశంగా నిలిచింది. ఈ ఉత్కంఠే 'బాహుబలి: ది కన్‌క్లూజన్'కు విపరీతమైన హైప్‌ను సృష్టించి, రికార్డు వసూళ్లకు దోహదపడింది. 'బాహుబలి: ది ఎపిక్' ( Baahubali The Epic ) రూపంలో ఈ సినిమాను మరోసారి ఒకే అనుభవంగా చూడటం అభిమానులకు గొప్ప అవకాశం. పదేళ్ల తర్వాత కూడా ఈ చిత్రం తన ప్రభావాన్ని కొనసాగించడం భారతీయ సినిమా చరిత్రలో ఒక అరుదైన ఘట్టం. ఈ రీ-రిలీజ్ కొత్త తరానికి కూడా 'బాహుబలి' మేజిక్‌ను పరిచయం చేయడానికి దోహదపడుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రీ రిలీజ్ తో మరోసారి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి మరి..