మేడారం ఆలయ అభివృద్ధికి వంద ఎకరాల భూసేకరణ: మంత్రి సీతక్క

మేడారం ఆలయ అభివృద్ధికి వంద ఎకరాల భూసేకరణ:  మంత్రి సీతక్క
  • ఇప్పటికే 50 ఎకరాలు సేకరించినం 
  • ఆలయ శాశ్వత అభివృద్ధికి ప్రత్యేక కమిటీ
  • తల్లుల వాస్తవ చరిత్ర  తెలిసేలా శిలాశాసనాల ఏర్పాటు:  మేడారంలో మంత్రి సీతక్క

మేడారం (ఏటూరునాగారం), వెలుగు: మేడారం ఆలయాన్ని వంద ఎకరాలతో అభివృద్ధి చేయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. మహా జాతర అసలైన ఘట్టం మరికొన్ని గంటల్లో అవిష్కృతం కానున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి మేడారంలోని మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. 

సీతక్క  మాట్లాడుతూ బుధవారం సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజులు గద్దెలపైకి చేరుకుంటారన్నారు. 22న చిలుకులగుట్ట నుంచి సమ్మక్క వస్తుందన్నారు.  తల్లులకు 23న భక్తులు మొక్కులు చెల్లించుకున్నాక, 24న వన ప్రవేశం చేస్తారన్నారు. భక్తుల రవాణాకు  ఇబ్బందులు లేకుండా  రోడ్లు వెడల్పు చేశామన్నారు. హన్మకొండ నుండి పస్రా, తాడ్వాయి నుండి మేడారం వరకు ఫోర్​లైన్ల రోడ్లు వేశామన్నారు. ఊరట్టం నుంచి పార్కింగ్ స్పాట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతరను జాతీయ పండుగగా గుర్తించేందుకు ప్రతిపాదనలు చేశామన్నారు. ఇప్పటికే 60 లక్షల మంది భక్తులు అమ్మవార్ల దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. 

గవర్నర్ , ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, అమ్మవార్ల దర్శనానికి రానున్నారన్నారు. వీఐపీలకు పాస్​లతో వచ్చేవారు సామాన్యులకు ఇబ్బంది కలగకుండా దర్శనం  చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జాతరలో 16వేల మంది కింది స్థాయి సిబ్బంది, అదేవిధంగా 12వేల మంది పోలీసు సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలిపారు. శానిటేషన్, స్నానఘట్టాలు, మీడియా పాయింట్, తాగునీరు, అన్నింటి పరిధి పెంచినట్లు చెప్పారు. మేడారం ఆలయ శాశ్వత అభివృద్ధికి ఇప్పటివరకు  50 ఎకరాల భూ సేకరణ పూర్తయిందని, మరో 50 ఎకరాల భూ సేకరణ కోసం రైతులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. 

 మేడారంలో పచ్చదనం, పర్యావరణం పెంపొందేలా జంపన్న వాగు వద్ద మొక్కలు నాటనున్నట్లు చెప్పారు. సమ్మక్క -సారలమ్మ యుద్ద పోరాటం, తల్లుల చరిత్ర వెయ్యి ఏళ్లు గుర్తుండిపోయేలా శిలాశాసనం ఏర్పాటు చేయిస్తామన్నారు. జాతర అనంతరం శాశ్వత అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి..రాన్నున మినీ జాతర కల్లా  మేడారాన్ని మరింత అభివృద్ధి  చేస్తామని వెల్లడించారు. ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీవో అంకిత్, అడిషనల్​కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీజ, ఎండోమెంట్ కమిషనర్ పాల్గొన్నారు. 

సంస్కృతిసంప్రదాయాలను కాపాడుకోవాలి

మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మేడారంలోని   ట్రైబల్ మ్యూజియంలో ఆదివాసీ కళాక్షేత్రం వద్ద జాతీయ సాంస్కృతిక పరిశోధన శిక్షణా  సంస్థ నిర్వహించిన జాతీయ గిరిజన నృత్య ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ జీవితంలో మనం ఏ స్థాయికి ఎదిగినా తర తరాల నుంచి వస్తున్న మన కట్టు బొట్టు, సంస్కృతి, సంప్రదాయలను మరవొద్దన్నారు. జాతర జరిగే ప్రతి రోజూ సాయంత్రం జరిగే గిరిజనుల నృత్య ప్రదర్శనలతో అలరిస్తారని, గోండ్ గుస్సాడీ, చచ్చోయి, కొమ్ము కోయా, రెలా, నాయక్ పోడు లక్ష్మి దేవరా, ఆంధ్ర వాగే, దండర్ అదివాసీ డ్యాన్సులు ఉంటాయన్నారు. ఐటీడీఏ పీవో అంకిత్, గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్​డైరెక్టర్​సర్వేశ్వర్​రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్​దిలీప్ కుమార్, ఇందిరా, శైలజ, డా. సత్యనారాయణ పాల్గొన్నారు.