చేప పిల్లల పంపిణీపై నజర్

 చేప పిల్లల పంపిణీపై నజర్
  • ఈ టెండర్  నోటిఫికేషన్  జారీ చేసిన మత్స్యశాఖ
  • ఉమ్మడి జిల్లాలో 4,253 చెరువుల్లో 10.38 కోట్ల చేప పిల్లలు వదలాలని టార్గెట్
  • హర్షం వ్యక్తం చేస్తున్న మత్స్యకార సొసైటీలు

గద్వాల, వెలుగు:ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేప పిల్లల పంపిణీకి టెండర్లు నిర్వహించేందుకు మత్స్యశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లాలోని 4,253 చెరువుల్లో 10.38 కోట్ల చేప పిల్లలను వదలాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటికే గద్వాల జిల్లాలో టెండర్​ ప్రక్రియ స్టార్ట్  అయింది. నాగర్ కర్నూల్  జిల్లాలో వచ్చే నెలలో టెండర్  ప్రక్రియను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

నాగర్ కర్నూల్  జిల్లాలోని 1,056 చెరువుల్లో 2.58 కోట్ల చేప పిల్లలు వదలాలని టార్గెట్ గా పెట్టుకోగా, మహబూబ్ నగర్  జిల్లాలోని 1,091 చెరువుల్లో 1.98 కోట్లు, వనపర్తి జిల్లాలోని 1,090 చెరువుల్లో 2 కోట్లు, నారాయణపేట జిల్లాలోని 641 చెరువుల్లో 1.82 కోట్లు, జోగులాంబగద్వాల జిల్లాలోని 375 చెరువులు, రిజర్వాయర్లలో 2 కోట్ల చేప పిల్లలు వదలాలని టార్గెట్  పెట్టుకున్నారు. చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో మత్స్యకార సొసైటీ సభ్యులు, మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గద్వాలలో 2 కోట్ల చేప పిల్లలు..

జోగులాంబ గద్వాల జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లలో 2 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా ఈ నెల 18న ఈ టెండర్  నోటిఫికేషన్  జారీ చేశారు. చిన్న చేప పిల్లలు (35ఎంఎం నుంచి 40 ఎంఎం) 62 పైసలు, పెద్ద చేప పిల్లలు (80 ఎంఎం నుంచి100 ఎం ఎం) రూ.1.65గా రేటు నిర్ణయించి టెండర్  ఆహ్వానించారు. గద్వాల జిల్లాలో నెట్టెంపాడు లిఫ్ట్  ద్వారా నీటిని ఎత్తిపోయడంతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. జిల్లాలోని 375 చెరువులు, రిజర్వాయర్లు, కుంటల్లో 60 శాతం నీళ్లు నిండిన వాటిలో చేప పిల్లలు వదలాలని మత్స్యశాఖ అధికారులు నిర్ణయించారు.

గద్వాల జిల్లాలో చేపల ఉత్పత్తి కేంద్రం..

జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం తిమ్మాపూర్  దగ్గర 40 హెక్టార్లలో  చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఉంది. ఒక్క హెక్టార్  చేప పిల్లల కేంద్రం నుంచి 25 లక్షల చేప పిల్లలు ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 91 మత్స్యకార సొసైటీలు ఉన్నాయి. ఇందులో 6,980 మంది సభ్యులు ఉన్నారు. 2,960 మంది లైసెన్స్  హోల్డర్స్  ఉన్నారు. ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడంతో జిల్లాలోని 9,940 మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. టెండర్  దక్కించుకున్న కాంట్రాక్టర్  క్వాలిటీ చేప పిల్లలు అందించేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.

టెండర్  ప్రక్రియ ప్రారంభమైంది..

గద్వాల జిల్లాలో చేప పిల్లల పంపిణీకి టెండర్  ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల ఒకటిన టెండర్లను ఓపెన్  చేస్తాం. దాదాపు రెండు కోట్ల చేప పిల్లల పంపిణీ కోసం టెండర్లు పిలిచాం.–షకీలాభాను, ఏడీ, మత్స్యశాఖ