74.5 శాతం మార్కులు సాధించిన 105 ఏళ్ల బామ్మ

74.5 శాతం మార్కులు సాధించిన 105 ఏళ్ల బామ్మ

వయసుతో సంబంధం లేకుండా చదువుకోవాలన్న ఆశ ఉన్న వారికి ఈ బామ్మ ఓ ఇన్‌స్పిరేషన్. కేరళ రాష్ట్ర ‘అక్షరాస్యత మిషన్‌’ చరిత్రలో రికార్డ్ సృష్టించిన ఈ బామ్మ పేరు బాగీరథీ అమ్మ. ఆమె వయసు 105 ఏళ్లు. కొల్లామ్‌కి చెందిన ఆమె స్టేట్ లిటరసీ మిషన్ కింద విద్య అత్యధిక వయస్కురాలిగా నిలిచింది. గత నవంబర్‌లో నాలుగో తరగతి పరీక్ష రాసిన ఆమె 74.5 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది.

కేరళలోని కొల్లాం జిల్లా పరకుళం గ్రామానికి చెందిన బాగీరథీ అమ్మకు ఆరుగురు పిల్లలు, 16 మంది మనవళ్లు ఉన్నారు. 9 ఏళ్ల వయసులో ఆమె తన తోబుటువుల బాగోగులు చూడాల్సి రావడంతో మూడో తరగతితో చదువు ఆపేయక తప్పలేదు. అయితే ఇన్నేళ్లుగా తనలో చదువు కోవాలన్న కోరిక అలానే మిగిలిపోయిందని, లిటరసీ మిషన్ అధికారుల సహకారంతో ఆ కల నెరవేరిందని బాగీరథీ అమ్మ చెప్పారు. గత నవంబర్‌లో నాలుగో తరగతి పరీక్ష రాశానని, 275కు గానూ 205 మార్కులతో పాస్ అయ్యానని చెబుతోందామె.

105 ఏళ్ల వయసులో ఈ బామ్మ పరీక్ష రాసి 74.5 శాతం మార్కులతో పాస్ కావడం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు స్టేట్ లిటరసీ మిషన్ జిల్లా స్థాయి కోఆర్డినేటర్ సీకే ప్రదీప్ కుమార్. అనివార్య కారణాలతో చదువును మధ్యలోనే ఆపేసి.. మళ్లీ కొనసాగించాలన్న ఆశ ఉన్నవారికి, రోజువారీ అవసరాలకు అవసరమైన కనీస విద్య నేర్చుకోవాలనుకునే వారికి విద్యను అందించేందుకు కేరళ స్టేట్ లిటరసీ మిషన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.