నల్గొండలో తొలిరోజు 16 నామినేషన్లు

నల్గొండలో తొలిరోజు 16 నామినేషన్లు
  •     అత్యధికంగా నల్గొండ జిల్లాలో 11 దాఖలు
  •     సూర్యాపేటలో మూడు, యాదాద్రి జిల్లాలో రెండు..
  •     ఆలేరులో నామినేషన్ వేసిక కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల అయిలయ్య

యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ అర్బన్, వెలుగు: ఉమ్మడి జిల్లా పరిధిలోని 12 నియోజకవర్గాల్లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. తొలిరోజైన శుక్రవారం   నల్గొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు సంబంధించి 11 నామినేషన్లు దాఖలయ్యాయి. నాగార్జున సాగర్​ నియోజకవర్గంలో గాదె సైదిరెడ్డి, మిర్యాలగూడలో మల్లిడి వెంకటరామరెడ్డి, ధనావత్​ ఉషానాయక్,​మునుగోడులో బేరి వెంకటేశ్​, మాదగోని వెంకటేశ్వర్లు, బుషిపాక వెంకటయ్య  ఇండిపెండెంట్​ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.

నల్గొండ నియోజకవర్గంలో మారం వెంకట్​రెడ్డి ఇండిపెండెంట్‌‌గా, ఆలిండియా ఫార్వర్డ్​బ్లాక్​ అభ్యర్థి పిల్లి రామరాజు తరపున ఆయన సోదరుడు పిల్లి కృష్ణంరాజు, నకిరేకల్​ నియోజకవర్గంలో ఇండిపెండెంట్​ అభ్యర్థులుగా రేకల సైదులు, చినేని లక్ష్మయ్య, బహుజన లెఫ్ట్​ పార్టీ అభ్యర్థిగా నూనె వెంకటస్వామి నామినేషన్​ వేశారు. 

సూర్యాపేటలో మూడు నామినేషన్లు

సూర్యాపేట జిల్లాలో మొదటి రోజు మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి.  జిల్లాలోని నాలుగు నియోజక వర్గాలుండగా..  కోదాడ, సూర్యాపేట(రెండు చోట్ల)లో ప్రజావాణి పార్టీ అభ్యర్థి లింగిడి వెంకటేశ్వర్లు, తుంగతుర్తి నుంచి ఎంసీపీఐ అభ్యర్థి ఎదుల వీర పాపయ్య నామినేషన్ వేశారు.  హుజూర్ నగర్‌‌‌‌లో ఎవరూ నామినేషన్లే వేయలేదు. ప్రధాన పార్టీల అభ్యర్థులు మంచిరోజు, ముహూర్తం చూసుకొని నామినేషన్ వేయనున్నట్లు తెలిసింది. 

బీర్ల అయిలయ్య ఆస్తి రూ.6.87 కోట్లు

యాదాద్రి జిల్లా ఆలేరు అసెంబ్లీకి మొదటి రోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్​ అభ్యర్థి బీర్ల అయిలయ్య, యుగ తులసి పార్టీ అభ్యర్థి కందడి మణిపాల్​రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరిలో నామినేషన్లు దాఖలు కాలేదు. బీర్ల అయిలయ్య తన పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్​ సమర్పించారు. తనతో పాటు కుటుంబ ఆస్తి విలువ రూ.6.78 కోట్లుగా పేర్కొన్నారు.

డిపాజిట్లు రూ.1.12 కోట్లు, కంపెనీల్లో షేర్లు రూ. 45 లక్షలు, బ్యాంకు లోన్లు రూ.2.98 కోట్లు, రూ.34 లక్షల విలువైన బంగారం, 1.64 కోట్ల వాల్యు ఉన్న 5 వెహికల్స్‌‌ ఉన్నట్లు ప్రకటించారు.  ఈ నెల  10 వరకు నామినేషన్లు ప్రక్రియ కొనసాగుతుందని, నియోజకవర్గాల ఆర్‌‌‌‌వో కేంద్రాల వద్ద ఎన్నికల నిబందన మేరకు నామినేషన్లు సమర్పించాలని కలెక్టర్లు సూచించారు.