ఐదేళ్లలో ఎయిర్ పోర్టుల్లో 11 వేల కిలోల బంగారం సీజ్

ఐదేళ్లలో ఎయిర్ పోర్టుల్లో 11 వేల కిలోల బంగారం సీజ్
  •     ఆ బంగారం విలువ రూ.3,122.8 కోట్లు
  •     2015 నుంచి ఈ ఏడాది ఆగస్టు దాకా 16,555 కేసులు
  •     8,401 మందిని అరెస్ట్​ చేసిన అధికారులు
  •     టాప్​టెన్​ ఎయిర్​పోర్టుల్లో శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​ది తొమ్మిదో స్థానం

న్యూఢిల్లీ: ఇస్త్రీ పెట్టెల్లో పెట్టుకొచ్చి పట్టుబడిపోయారు. కడ్డీల్లో దాచుకొచ్చి దొరికిపోయారు. లగేజీ బ్యాగుల తీగల్లో చెక్కి చిక్కిపోయారు… ఒకటా రెండా.. ఇలాంటి గోల్డ్​ స్మగ్లింగ్​ గుట్టును ఈ మధ్య మన హైదరాబాద్​ శంషాబాద్​ ఎయిర్​పోర్టు అధికారులు ఎట్ల రట్టు చేశారో చూశాం. అధికారుల కన్నుగప్పి బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చే ప్రయత్నం చేసి స్మగ్లర్లు విఫలమయ్యారు. మన ఎయిర్​పోర్ట్​ ఒక్కటే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎయిర్​పోర్టుల నుంచీ బంగారాన్ని స్మగ్లింగ్​ చేస్తూ ఆ ముఠాలు అడ్డంగా దొరికాయి. మరి, దేశవ్యాప్తంగా ఈ ఐదేళ్లలో అన్ని ఎయిర్​పోర్టుల్లో అధికారులు సీజ్​ చేసిన బంగారం ఎంతో తెలుసా..? అక్షరాల పదకొండు వేల కిలోలు. మరి దాని విలువెంత.. రూ.3,122.8 కోట్లు. 2015 నుంచి ఈ ఏడాది ఆగస్టు నాటికి ఐదేళ్లలో 16,555 గోల్డ్​ స్మగ్లింగ్​ కేసులు నమోదైతే.. ఆ కేసుల్లో సీజ్​ చేసిన బంగారమే ఇదంతా. మొత్తం 8,401 మందిని అధికారులు అరెస్ట్​ చేశారు. సెప్టెంబర్​లో జరిగిన పార్లమెంట్​ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన లెక్కలివి.

దేశానికి అక్రమంగా బంగారాన్ని తరలించేందుకు కేరళ ఎయిర్​పోర్టులనే ఎంచుకుంటున్నారు స్మగ్లర్లు. గోల్డ్​ స్మగ్లింగ్​ కేసులు ఎక్కువగా నమోదైన, ఎక్కువ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న టాప్​టెన్​ ఎయిర్​పోర్టుల్లో ఆ రాష్ట్రానివే మూడున్నాయి. ఈ జాబితాలో మన హైదరాబాద్​ శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఫస్ట్​ ప్లేస్​లో ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​ ఉంది. ఇక, 2015 నుంచి 2020 వరకు ఐదేళ్లలో 2018లోనే గోల్డ్​ స్మగ్లింగ్​ ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ఆ ఏడాదిలోనే ఎక్కువ గోల్డ్​నూ అధికారులు సీజ్​ చేశారు. అయితే, స్వాధీనం చేసుకున్న బంగారం విలువ మాత్రం 2019లో ఎక్కువగా ఉంది. ఆ ఏడాది సీజ్​ చేసిన గోల్డ్​ అంతకుముందు ఏడాదితో పోలిస్తే తక్కువే అయినా.. 2019 గోల్డ్​ రేటు ప్రకారం అక్రమంగా తీసుకొచ్చిన ఆ గోల్డ్​ విలువ ఎక్కువ. అదే ఏడాది ఎక్కువ మందిని అధికారులు అరెస్ట్​ చేశారు. ఆ ఏడాది 2,339 మందిని కటకటాల్లోకి నెట్టారు. 2015–16లో 1,408 మందిని, 2016–17లో 788 మంది, 2017–18లో 1,525, 2018–19లో 2,141, 2020–2021లో ఇప్పటిదాకా 200 మందిని కస్టమ్స్​ ఆఫీసర్లు అరెస్ట్​ చేశారు.

గోల్డ్​ ఎక్కువ దొరికిన టాప్ టెన్ ఎయిర్పోర్టులివే

  •    ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​, ముంబై
  •    ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​, న్యూఢిల్లీ
  •    అన్నా ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​, చెన్నై
  •    కాలికట్​ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​, కేరళ
  •    కొచ్చిన్​ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​, కేరళ
  •    కెంపెగౌడ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​, బెంగళూరు
  •    నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​, కోల్​కతా
  •    తిరుచురాపల్లి ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​, తమిళనాడు
  •    రాజీవ్​గాంధీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​, హైదరాబాద్​ (శంషాబాద్​)
  •    త్రివేండ్రం ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​, కేరళ