దేశంలో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు.. ఆల్ టైం రికార్డ్

దేశంలో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు.. ఆల్ టైం రికార్డ్

దేశంలో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. బుధవారం మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. దేశంలోకి కరోనా వచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైం కరోనా కేసులు లక్షా 15 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 630 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అయితే మిగతా దేశాలతో పోలిస్తే మరణాల రేటు మాత్రం భారత్‌లోనే అతి తక్కువగా ఉండటం కాస్త ఉపశమనాన్ని ఇస్తోంది. మన దేశంలో పది లక్షల మందికి కరోనా సోకితే అందులో 120 మందే చనిపోతున్నారు. అదే అమెరికాలో 1700 మంది, బ్రెజిల్‌లో 1500 మంది చనిపోతున్నారు. ఫ్రాన్స్‌‌లోనూ దాదాపు 1500 మంది చనిపోతున్నారు. కరోనా మరణాలు, పాజిటివ్ కేసుల్లో అమెరికా ఫస్ట్ ప్లేస్‌లో, బ్రెజిల్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. భారత్ మూడో స్థానంలో ఉంది.

ఓ వైపు దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తుంటే... అందరికీ వ్యాక్సిన్ ఇప్పట్లో రాదని కేంద్రం తేల్చేసింది. కరోనా ఉధృతిని ఆపేందుకు 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలతో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్రాన్ని కోరాయి. అయితే అలా చేయడం కుదరదని కేంద్రం తేల్చిచెప్పింది. కోరుకున్నవారికి కాకుండా... అవసరమైన వారికే వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది.