
ఉమ్మడి ఏపీలో తలపెట్టిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు కోసం 2016 నాటికి (కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్‌చేసే వరకు) రూ.11,679.71 కోట్లు ఖర్చు చేశామని ఈఎన్సీ తెలిపారు. ‘‘ప్రాణహిత నది నుంచి 160 టీఎంసీలను ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు తరలించి 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రూ.17,875 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు ఇస్తూ 2007 మే 16న జీవో 124 జారీ చేశారు. ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో 6.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రాజెక్టు అంచనాలను రూ.38,500 కోట్లకు పెంచుతూ 2008 డిసెంబర్ 17న జీవో 238 జారీ చేశారు.
తద్వారా పాత అంచనాలను సవరిస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చారు. ప్రాణహిత ద్వారా నీళ్లు ఎత్తిపోయడానికి 3,466 మెగావాట్ల (అంటే ఏటా 8,701 మిలియన్ యూనిట్లు) కరెంట్ అవసరమని అంచనా వేశారు. రీ ఇంజనీరింగ్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మధ్యంతరంగా వదిలేసింది. ప్రాణహిత – చేవెళ్లలో భాగంగా తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో 5.09 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ ప్రతిపాదించగా.. మహారాష్ట్ర పరిధిలో 3,786 ఎకరాల ముంపు ఉండడంతో ఆ రాష్ట్రం అభ్యంతరం తెలిపింది. దీంతో బ్యారేజీ ఎత్తును 148 మీటర్లకు తగ్గించాలని మహారాష్ట్ర పట్టుబట్టింది.
సీడబ్ల్యూసీ అంచనాల ప్రకారం తుమ్మిడిహట్టి వద్ద 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా నీటి లభ్యత 165.38 టీఎంసీలు మాత్రమే. నీటి నిల్వల కోసం ప్రత్యామ్నాయాలను చూడాలని సీడబ్ల్యూసీ సూచించింది. దీంతో వ్యాప్కోస్ ద్వారా స్టడీ చేసి మేడిగడ్డ వద్ద 282.3 టీఎంసీల లభ్యత ఉందని తేలడంతో ప్రాజెక్టును అక్కడికి మార్చాం” అని వివరించారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ నుంచి ఐదేండ్లలో 162.32 టీఎంసీలు ఎత్తిపోసినట్లు ఈఎన్సీ తెలిపారు.