వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సప్లయ్: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సప్లయ్: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
  • డిప్యూటీ సీఎం చొరవతో భూపాలపల్లిలో 12 సబ్ స్టేషన్ల ఏర్పాటు 
  •  డీబీఎం 38 ద్వారా గోదావరి జలాలను అందిస్తాం 
  •  ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: దేశానికి అన్నం పెట్టే రైతుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సప్లయ్ చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు తెలిపారు. శుక్రవారం ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో చిట్యాల మండలం ఒడితల  గ్రామంలో రూ.2.2 కోట్లతో నిర్మించిన  33/11 కేవీ విద్యుత్ సబ్​స్టేషన్​ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. 

రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా, సాగునీటి సదుపాయాల కల్పనతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గత రెండున్నరేండ్లలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరువతో జిల్లాలో 12 కొత్త విద్యుత్ సబ్​స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. భూగర్భ జలాల ఆధారంగా వ్యవసాయం చేసే రైతులకు బోర్లు, మోటార్ల ద్వారా సాగు చేసుకునేందుకు విద్యుత్ సదుపాయాలను మెరుగుపరుస్తూ అండగా నిలుస్తున్నామని చెప్పారు. 

గోదావరి నది జలాలను, అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను రైతులకు చేరువ చేసేందుకు డీబీఎం-38  ద్వారా నీటిని అందించే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. ఎల్​నినో ప్రభావంతో ఏర్పడుతున్న వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో ఉంచుకొని రైతులకు నీటి వసతి కల్పించడంతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.  కార్యక్రమంతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య,  ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సదానందం, సర్పంచ్ భగవాన్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.