వెంకటాపూర్ , వెలుగు : గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. గురువారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో పీఏసీఎస్ నూతన కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలోచేపట్టిన అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయిన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆశించిన మేర వర్షాలు కురవని ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం గోవిందరావుపేట మండలం పసర జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ విద్యార్థుల అవగాహన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది విద్య అని, విద్యార్థులు ఆసక్తితో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పాఠశాలల్లో, ప్రయాణ సమయాల్లో, పరిసరాల్లో ఎదురయ్యే వేధింపులను గుర్తించేలా పిల్లలు వ్యక్తిగత భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. పోక్సో చట్టం, సైబర్ నేరాలు, బాలల రక్షణ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు ‘గుడ్ టచ్.. - బ్యాడ్ టచ్’ గురించి మాట్లాడే బొమ్మ ద్వారా ప్రత్యక్షంగా వివరించారు.
