తెలుగు రాష్ట్రాల్లోని 18మంది ఎంపీల ఆస్తుల విలువ రూ.9వేల కోట్లకు పైగానే..

తెలుగు రాష్ట్రాల్లోని 18మంది ఎంపీల ఆస్తుల విలువ రూ.9వేల కోట్లకు పైగానే..

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీల్లో కొంతమంది ఆస్తుల విషయం తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుల్లో కొందరు బిలియనీర్లు ఉన్నారు. అవును.. ఇదే విషయాన్ని  అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫార్మ్స్ (ADR) స్పష్టం చేసింది. 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా రాజ్యసభకు ఎన్నికైన సిట్టింగ్‌ ఎంపీల్లో 12 శాతం మంది బిలియనీర్లు ఉన్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫార్మ్స్ (ADR) వెల్లడించింది. ఏడీఆర్, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ అనే సంస్థతో కలిసి 225 మంది (మొత్తం 233 మంది సభ్యులు) రాజ్యసభ సభ్యులపై ఉన్న నేరాలు, ఆస్తుల వివరాలతో నివేదికను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి ఈ జాబితాలో 18 మంది ఎంపీలు ఉన్నారు. వీరి మొత్తం ఆస్తుల విలువ రూ.9 వేల 419 కోట్లు ఉన్నట్లు చెప్పింది. 

అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫార్మ్స్ నివేదిక ప్రకారం..

రాజ్యసభ ఎంపీల్లో ఆంధ్రప్రదేశ్‌ -నుంచి ఐదుగురు ( మొత్తం 11 మంది ఎంపీలు ), తెలంగాణ నుంచి ముగ్గురు (మొత్తం ఏడుగురు ఎంపీలు), మహారాష్ట్ర -నుంచి ముగ్గురు (19 మందిలో), ఢిల్లీ నుంచి ఒకరు (ముగ్గురు ఎంపీలు), పంజాబ్‌ నుంచి ఇద్దరు (ఏడుగురు ఎంపీలు), హర్యానా నుంచి ఒకరు (ఐదుగురు ఎంపీలు), మధ్యప్రదేశ్‌ నుంచి ఇద్దరు (మొత్తం 11 మంది) ఎంపీలు తమ ఆస్తుల విలువ రూ.100 కోట్లుగా ప్రకటించినట్లు తెలిపింది. 

తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడుగురు ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ.5 వేల 596 కోట్లు. ఇక ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 11 మంది ఎంపీల ఆస్తుల విలువ రూ.3 వేల 823 కోట్లుగా ఉంది. ఇక ఉత్తరప్రదేశ్‌కు చెందిన 30 మంది రాజ్యసభ సభ్యుల ఆస్తులు విలువ రూ. ఒక వెయ్యి 941 కోట్లుగా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. 

మొత్తం 225 మంది సభ్యుల్లో 75 మంది తమపై క్రిమనల్‌ కేసులు ఉన్నట్లు వెల్లడించారని తెలిపింది.  41 మంది సిట్టింగ్‌ రాజ్యసభ సభ్యులపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉండగా, మరో ఇద్దరు ఎంపీలపై హత్య కేసులు నమోదైనట్లు వెల్లడించింది. నలుగురు ఎంపీలపై మహిళా వేధింపులకు సంబంధించిన కేసులు ఉన్నట్లు తెలిపింది. వీరిలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌పై ఆత్యాచార కేసు నమోదైనట్లు నివేదికలో పేర్కొంది. 

బీజేపీకి చెందిన 85 మంది రాజ్యసభ సభ్యుల్లో 23 మందిపై, కాంగ్రెస్‌కు చెందిన 30 సభ్యుల్లో 12 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు తమ అఫిడవిట్‌లో పేర్కొనట్లు తెలిపింది. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన 13 మంది, ఆర్జేడీ నుంచి నామినేట్‌ అయిన ఐదుగురిపై, సీపీఐ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురిపై, ఆప్‌ పార్టీకి చెందిన ముగ్గురు, వైఎస్సార్‌సీపీకి చెందిన ముగ్గురు, ఎన్సీపీకి చెందిన ఇద్దరు ఎంపీలపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదికలో పేర్కొంది.