అమ్మా.. 'నేను కుర్‌కురేను దొంగతనం చేయలేదు': ఆవేదనతో 12 ఏళ్ల బాలుడి ఆత్మహత్య

అమ్మా.. 'నేను కుర్‌కురేను దొంగతనం చేయలేదు': ఆవేదనతో 12 ఏళ్ల బాలుడి ఆత్మహత్య

ఈ రోజుల్లో పిల్లలు చాలా సున్నితంగా ఉంటున్నారు. ఎంత తెలివిగా ఉంటున్నారో ప్రాణాలు తీసుకోవటంలోనూ అంతే స్పీడుగా ఉంటున్నారు. చిన్నచిన్న కారణాలకు సైతం సూసైడ్ చేసుకోవటం చాలా మంది తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది.

తాజాగా బెంగాల్ మెడినిపూర్ జిల్లాలో ఒక కుర్‌కురే ప్యాకెట్ వివాదం క్రిషేందు దాస్ 12 ఏళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. అక్కడి గోసైబర్ బజార్‌ ప్రాంతంలో చిప్స్ ప్యాకెట్ దొంగిలించాడంటూ అందరిలో శిక్షించటంతో చులకనగా ఫీలైన కుర్రోడు పురుగులమందు తాగి ప్రాణాలు తీసుకోవటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. 7వ తరగతి చదువుతున్న విద్యార్థి చిప్స్ ప్యాకెట్ దొంగిలించాడంటూ గుంజీళ్లు తీయించారు.

వాస్తవానికి షాపుకు చిప్స్ ప్యాకెట్ కొనటానికి తన కుమారుడు వెళ్లినప్పుడు అంకుల్ చిప్స్ ప్యాకెట్ కొనుక్కోవటానికి వచ్చాను అంటూ పిలిచినప్పటికీ షాపు యజమాని స్పందించలేదని దీంతో అక్కడి నుంచి ఒక ప్యాకెట్ చిప్స్ తీసుకుని వచ్చేసినట్లు పిల్లాడి తల్లి పోలీసులకు వెళ్లడించింది. దీంతో షాపుకు వచ్చిన యజమాని శుభాంకర్ దీక్షిత్ పిల్లాడి వెనుక వెళ్లి కొట్టాడు. పైగా అందరి ముందు గుంజీళ్లు తీయించాడు. ఆ తర్వాత పిల్లాడి తల్లిని షాపు వద్దకు పిలిపించగా పిల్లాడిని తిట్టి, చెంపదెబ్బ కొట్టింది. 

వాస్తవానికి షాప్ ఎదురుగా పడిఉన్న ప్యాకెట్ తాను తీసుకున్నానని, దానికి డబ్బులు చెల్లించటానికి తర్వాత వచ్చినట్లు పిల్లాడు చెప్పాడు. ఈ క్రమంలో జరిగినదానిపై క్షమాపణలు చెప్పటంతో పాటు సదరు ప్యాకెట్ కి డబ్బు చెల్లించటానికి పిల్లాడు ముందుకొచ్చినప్పటికీ.. షాపు యజమానికి దానికి అంగీకరించకుండా.. అబద్ధాలు చెబుతున్నావ్ అంటూ పిల్లాడిపై కోపడ్డాడు. ఇదంతా జరిగాక బాధతో ఇంటికి వచ్చిన క్రిషేందు దాస్ ఇంట్లో తన గది తలుపు వేసుకుని గడియపెట్టుకున్నాడు. కొంత సమయం తర్వాత తల్లి పొరిగించి వారి సాయంతో డోర్ పగలకొట్టి చూడగా నోటి నుంచి నురగలు రావటం గమనించారు. 

పురుగుల మందుతాగిన పిల్లాడి పక్కన బెంగాలీలో ఒక నోట్ ఉంది. అందులో అమ్మా నేను దొంగను కాదు. నేను దొంగతనం చేయలేదు. నేను వేచి దుకాణ యజమాని అక్కడ లేడు. తిరిగి వస్తుండగా రోడ్డు మీద పడి ఉన్న కుర్‌కురే ప్యాకెట్‌ను చూసి దాన్ని తీసుకున్నాను. నాకు కుర్‌కురే అంటే చాలా ఇష్టం అని అందులో ఉండటం అందరి మనసులను కలచివేసింది. ఇవే తన చివరి మాటలు అంటూ తనను క్షమించాలని అందులో వేడుకున్నాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించాడు. తనపై దొంగ అంటూ వేసిన ముద్రను ఆ పసిహృదయం తట్టుకోలేకపోయింది.