సాగర్ ఎడమ కాల్వ షటర్​ కొట్టుకపోయింది

సాగర్ ఎడమ కాల్వ షటర్​ కొట్టుకపోయింది
  • కొన్నేండ్ల క్రితమే గేటుకు తుప్పు పట్టినా.. రిపేర్లు చేయని ఆఫీసర్లు
  • ఎన్నికల వేళ పాలేరుకు నీటిని విడుదల చేయడంతో ప్రమాదం

మునగాల, వెలుగు:  నాగార్జున సాగర్​ ఎడమ కాల్వ కింద వందల ఎకరాల్లో చేతికొచ్చిన పంట నీటమునిగింది.  సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలో(113 కిలో మీటర్ వద్ద) ఉన్న ఎస్కేప్ షటర్(గేటు)​ పగిలిపోయి, కొట్టుకపోయింది. దీంతో నీరు ఒక్కసారిగా కట్టలు తెంచుకొని పోలేనుగూడెం, బేతవోలు, మునగాల పరిధిలోని వెయ్యి నుంచి1200 ఎకరాల్లోని వరి పొలాలను ముంచింది. ఎస్కేప్​గేటుకు తుప్పుపట్టి ఏండ్లు గడుస్తున్నా, మరమ్మతులు చేపట్టకపోవడం, ఎన్నికల వేళ పాలేరు రిజర్వాయర్​కు నీటిని విడుదల చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

ఎస్కేప్​ షటర్​ను దాదాపు15 ఏండ్ల క్రితం ఏర్పాటు చేశారు. కాలక్రమేణా అది తుప్పు పట్టిపోయింది.కెనాల్​కు లైనింగ్ వేసే సమయంలో అప్పటికే తుప్పు పట్టిన షటర్​కు రిపేర్లు చేయాలని రైతులు కోరినా ఆఫీసర్లు పట్టించుకోలేదు. ఈసారి ఎడమకాలువ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వకపోవడంతో షటర్ ను ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం పాలేరు రిజర్వాయర్ కు తాగునీటి అవసరాల పేరిట 4 రోజుల క్రితం ఎడమ కాలువకు నీటిని విడుదల చేసింది.

ఈ సమయంలో కెనాల్​లో సుమారు 19 అడుగుల మేర అంటే 6,400 క్యూసెక్కులు నీరు వస్తోంది. ఈ వరద ఉధృతికి తుప్పు పట్టి ఉన్న ఎస్కేప్ షటర్ పగిలిపోయి నీటిలో కొట్టుకుపోయింది. ఖమ్మం జిల్లాకు నీటిని తరలిస్తుండగానల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో రైతులెవరూ షటర్లు ఎత్తకుండా అన్ని చోట్లా సిబ్బందిని కాపలా పెట్టారు. కాగా, షటర్​ఒక్కసారిగా కొట్టుకుపోతున్నప్పుడు వచ్చిన శబ్దం విని సిబ్బంది ఉలిక్కిపడ్డారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఎన్ఎస్పీ ఆఫీసర్లు ఎస్సీ నరసింహా, ఎస్ఈ సత్యనారాయణ, డీఈ రఘు, ఏఈ సత్యనారాయణ చేరుకొని పరిశీలించి నీటి విడుదల బంద్​పెట్టారు.

అప్పటికే సుమారు1500 క్యూసెక్కుల నీరు ముంచెత్తడంతో బేతవోలు ఎస్కేప్ కింద ఉన్న పోలేనుగూడెం, బేతవోలు, మునుగాల గ్రామాల పరిధిలోని సుమారు1000 నుంచి1200 ఎకరాల దాకా వరి పంట నీట మునిగింది. పాత షటర్​స్థానంలో కొత్తది ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈలోగా ప్రభుత్వం పాలేరుకు నీరు విడుదల చేయడంతో ప్రమాదం జరిగిందని ఆఫీసర్లు చెబుతున్నారు. చేతికొచ్చిన పంట నీట మునిగిందని, దానికి నష్ట పరిహారం చెల్లించేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.