కాబూల్ ఎయిర్‌‌పోర్ట్‌ వద్ద బాంబు పేలుడు

కాబూల్ ఎయిర్‌‌పోర్ట్‌ వద్ద బాంబు పేలుడు

తాలిబన్ల చెరలో చిక్కిన అఫ్గానిస్తాన్‌లో గురువారం ఉన్నట్టుండి బాంబు పేలుళ్లు జరిగాయి. కాబూల్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్టు ఎంట్రెన్స్‌ సమీపంలో జనాల గుంపుల మధ్య గుర్తు తెలియని టెర్రరిస్ట్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సుమారు 13 మంది మరణించినట్లు తాలిబన్ ప్రతినిధులు చెబుతున్నారు. మృతుల్లో పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా పదుల సంఖ్యలో జనాలు గాయపడ్డారు. అందులో సుమారు ముగ్గురు యూఎస్ సైనికులు ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

తాలిబన్లు అఫ్గాన్‌ను తమ గుప్పెట్లోకి తీసుకున్న రోజు నుంచి వేల సంఖ్యలో జనాలు రోజూ కాబూల్ ఎయిర్‌‌పోర్టుకు ఎగబడుతున్నారు. యూఎస్ మిలటరీ ఆధ్వర్యంలో ఆపరేట్ అవుతున్న ఈ ఎయిర్‌‌పోర్టు నుంచి విదేశాలకు వెళ్లిపోయేందుకు అక్కడున్న అమెరికన్లు, ఇతర దేశస్తులు, అఫ్గాన్ పౌరులు సైతం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వేల మందిని అక్కడి నుంచి తరలించేశారు. అయితే తరలింపు ఆపరేషన్లు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉగ్రవాదులు బాంబు దాడులకు పాల్పడే అవకాశం ఉందని, ప్రజలు ఎయిర్‌‌పోర్టు వైపు రావొద్దని వెస్ట్రన్ ఇంటెలిజెన్స్, మిలటరీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ వార్నింగ్ వస్తున్న క్రమంలో ఈ రోజు ఉన్నట్టుండి బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడు అమెరికా డిఫెన్స్ హెడ్‌క్వార్టర్ పెంటగాన్ ధ్రువీకరించింది.