మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టింగ్

మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టింగ్
  • ట్రైనింగ్ ఇచ్చేందుకు 14 సంస్థలను గుర్తించిన ఐసీఎంఆర్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా టెస్టింగ్ సెంటర్లను పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. దీని కోసం మెడికల్ కాలేజీలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు చండీగఢ్ లోని పీజీఐఎంఈఆర్, ఢిల్లీలోని ఎయిమ్స్, బెంగళూరులోని నిమాన్స్ తోపాటు 14 సంస్థలను సెంటర్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్ గా గుర్తించింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో టెస్టింగ్ సెంటర్లను పెంచేందుకు ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల నుంచి ఐసీఎంఆర్ దరఖాస్తులు ఆహ్వానించింది. వాటికి ట్రైనింగ్ ఇచ్చేందుకు 14 సంస్థలను గుర్తించింది. వివిధ రాష్ట్రాల్లోని ఈ సంస్థలు తమ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు ట్రైనింగ్ ఇవ్వనున్నాయి. ఈ మేరకు ఆయా సంస్థలకు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ లెటర్లు రాశారు. టెస్టింగ్ సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన వసతులు, సిబ్బంది, ఎక్విప్ మెంట్స్ సమకూర్చుకునేందుకు మెడికల్ కాలేజీలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాలని ఐసీఎంఆర్ సూచించింది. చండీగఢ్ లోని పీజీఐఎంఈఆర్ జమ్మూకాశ్మీర్, లడాఖ్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, ఉత్తరాఖండ్ లోని మెడికల్ కాలేజీలకు ట్రైనింగ్ ఇవ్వనుంది. ఢిల్లీ, బీహార్, పుణె, ముంబై, రాజస్థాన్, గుజరాత్ లోని మెడికల్ కాలేజీలకు ఢిల్లీలోని ఎయిమ్స్, కర్నాటకలోని మెడికల్ కాలేజీలకు బెంగళూరులోని నిమాన్స్ ట్రైనింగ్ ఇస్తుందని ఐసీఎంఆర్ వెల్లడించింది.